Janasena : ఆరణి సీటు కింద నీళ్లు వచ్చినట్లేనా? తిరుపతి రాజకీయం ఏం చెబుతుంది ?

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు కష్టాలు మొదలయినట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరుపతి శాసనసభ టిక్కెట్ దక్కేది కూడా కష్టంగానే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరణి శ్రీనివాసులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పాలి. తాజాగా టీడీపీ అధినాయకత్వం తిరుపతి ఇన్ ఛార్జిగా మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ ను నియమించడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊపు నిచ్చినట్లయింది. ఇప్పటి వరకూ తిరుపతి టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న సుగుణమ్మను తప్పించి ఆమె స్థానంలో మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ ను నియమించడం వెనక వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ ప్రసాద్ ను పోటీకి దింపాలన్న యోచనలోనే టీడీపీ నాయకత్వం ఉందన్నది పార్టీ వర్గాల ద్వారా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.

పార్టీ మారి వచ్చినా…

2019లొ వైసీపీ నుంచి గెలిచిన ఆరణి శ్రీనివాసులు 2024 ఎన్నికల్లో జనసేనలోచేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరణి శ్రీనివాసులకు తిరుపతి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ బలంగా ఉన్నప్పటికీ, అక్కడ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తనకు కావాలని గట్టిగా కోరినప్పటికీ పవన్ కల్యాణ్ తిరుపతి నియోజకవర్గం సీటును పట్టుబట్టి జనసేన ఖాతాలో వేసుకున్నారు కూటమి హవాలో ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి జనసేనలోకి గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా వైసీపీలో ఉన్న ఆయన పార్టీ మారి తిరుపతి జనసేన ఎమ్మెల్యే అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరణి శ్రీనివాసులు పార్టీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

క్యాడర్ ను పట్టించుకోకుండా

టీడీపీ, జనసేన క్యాడర్ ను పక్కన పెట్టి కొందరు వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారంటూ ఆరో్పణలు పలు దఫాలు ఎదుర్కొన్నారు. అలాగే సుగుణమ్మ కూడా జనసేన నేతలతో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని టీడీపీ నాయకత్వం భావించింది. జనసేన నాయకులే ఆరణి శ్రీనివాసులుపై ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా ధీటుగా ఆరణి శ్రీనివాసులు స్పందించక పోవడం కూడా ఆరణిపై ఆగ్రహానికి కారణమయిందంటున్నారు. కొంతకాలం క్రితం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లాస్ పీకారని తెలిసింది. ఇలాగైతే ఎలా.. కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలను కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ చెప్పారట. పాత పరిచయాలుంటే వాటిని వదిలేయాలని, జనసేనలో కొనసాగాలనుకుంటే మారాలని ఆరణి శ్రీనివాసులుకు పవన్ కల్యాణ్ ఒకింత సీరియస్ గానే చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలు మూడేళ్లకు ముందుగానే టీడీపీ ఇన్ ఛార్జిగా మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ ను పార్టీ నాయకత్వం నియమించినట్లు తెలిసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *