Tirumala : తిరుమలకు తగ్గని భక్తుల రద్దీ.. నేడు దర్శన సమయం?


Tirumala :

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వేసవి రద్దీ ఇంకా కంటిన్యూ అవుతున్నట్లే ఉంది. గతంలోఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, జులై నెలలో సాధారణంగానే భక్తుల రద్దీ ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కానీ ఈసారి మాత్రం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని పొంది, అలాగే ప్రకృతిని ఆస్వాదించేందుకు అధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

వీకెండ్.. హాలిడేస్ లోనూ...

సహజంగా వీకెండ్ లోనూ, హాలిడేస్ లోనూ తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ నేడు వారాలు, సీజన్ తో సంబంధం లేకుండా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గతంలో ఏడాదికి ఒకసారి వచ్చి స్వామి వారిని దర్శించుకునే వారు.. ఇప్పుడు వీలయితే వెంటనే వచ్చి ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈసారి ఉత్తర భారత దేశం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తులతో మాడ వీధులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.

అన్ని కంపార్ట్ మెంట్లు నిండి

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,172 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,978 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.15 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. నిన్న 4.25 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. నిన్న 2.57 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *