BRK ; Journalist Manoj Report : తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు.. ఈ ఏడాది తిండి గింజలూ కష్టమేనా?


Hyderabad :
మేఘాలు మాయమయ్యాయి.. కష్టాలు మొదలయ్యాయి!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడటం లేదు. అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతు పవనాల ప్రవేశం కూడా పెద్దగా పనిచేయడం లేదు. దీంతో కాడెద్దులు కదలడం లేదు. సాగు నిలిచిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు కరువుతో అలమటించిపోతున్నాయి. గతంలోఎన్నడూ లేని విధంగా కరువు ఈసారి విలయ తాండవం చేయనుంది. వానలు సకాలంలో పడకపోవడంతో రైతులు సాగు చేయలేకపోతున్నారు. మార్చి నుంచి జూన్ వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటు జులై నెలలో వానలు పడకపోవడంతో భూగర్భజలాలు కూడా ఎండిపోయాయి. దీంతో నీరు లేక అన్నదాతలు అలమటించిపోతున్నారు. ప్రాజెక్టుల్లో కూడా నీరు లేదు. కేవలం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి మాత్రం వరద నీరు పోటెత్తుతుంది.

రాయలసీమలోని అనేక ప్రాంతాలు…

ఆంధ్రప్రదేశ్ లో వానలు పడతాయని గత కొన్నిరోజులుగా వాతావరణ శాఖ పదే పదే చెబుతుంది. అయినా సరైన వానలు మాత్రం పడటం లేదు. చినుకు సందడి లేదు. అలాగే అనేక జిల్లాలు కరువుతో అలమటించిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అత్యధిక మండలాలలు కరువు మండలాలుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం గతం కంటే తక్కువగా నమోదవుతుందని ముందుగానే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ అంచనాలు నిజమవుతున్నాయి. మబ్బులు మురిపించడం తప్ప వానలు పడటం లేదు. దీంతో ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జులై నెల వరకూ వానలు పడవని భారత వాతావరణ శాఖ తేల్చి చెప్పడంతో ఆందోళన వ్యక్తమవుతుంది.

ముందుకు కదలని నాగలి…

తెలంగాణాలోనూ వానలు కురవడం లేదు. దీంతో నాగలి ముందుకు కదలడం లేదు. వ్యవసాయం చేయాలంటే పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన తెలంగాణలో బోరు బావులు కూడా ఎండపోయాయి. దీంతో సాగు నీరందక చాలా చోట్ల ఖరీఫ్ పంట వేయడానికి రైతులు దూరంగా ఉన్నారు. మరొకవైపు యూరియా, విత్తనాల కొరత కూడా ఎక్కువగా ఉంది. రోహిణి కార్తె నుంచి విత్తనాలను సేకరించి ఆరుద్ర కార్తె సమాయనికి సాగుకు సిద్ధం కావాల్సి ఉన్నప్పటికీ రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగుకు దూరంగా ఉన్నారు. తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతోతెలంగాణలోనూ కరువు ఛాయలు అలుముకున్నాయి. తమను ఆదుకోవాలని రైతాంగం కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *