Andhra Pradesh :అట్టుడుకుతున్న ఆళ్లగడ్డ.. సవాళ్లు – ప్రతి సవాళ్లు

Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయం హీటెక్కుతోంది. సవాళ్లు – ప్రతి సవాళ్లతో దద్దరిల్లిపోతుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి ల మధ్య రాజకీయం మరింత వేడెక్కడంతో టెన్షన్ మొదలయింది. అహోబిలం ఆలయం వద్ద టోల్ గేట్, తలనీలాల టెండర్లలో అవినీతి జరిగిందని గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రతిగా భూమా అఖిలప్రియ ప్రతి సవాల్ విసిరారు. గంగుల ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఇచ్చి, ఆళ్ల గడ్డ రాజకీయాల నుంచి తప్పుకుంటానని అఖిలప్రియ సవాల్ విసిరారు.

బహిరంగ చర్చకు…
అంతటితో ఆగలేదు. అహోబిలం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. అహోబిలం బయలుదేరి వెళ్లారు. బహిరంగ చర్చకు అవసరమైన వేదికను కూడా ఏర్పాటు చేశారు. లేని పోని ఆరోపణలు చేస్తూ తనను, తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి పై అఖిలప్రియ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని గంగుల ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు రాకుంటే గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి ఇంటికి వెళతానని కూడా ఆమె హెచ్చరికలు జారీ చేశారు.

అహోబిలంలో చర్చకు…
అయితే అహోబిలం చర్చకు వచ్చేందుకు గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరారు. కానీ శాంతి భద్రతల సమస్య దృష్ట్యా పోలీసులు ఆయనను ఇంటి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు కూడా తమను అహోబిలం వెళ్లేందుకు అనుమతివ్వాలని పోలీసులను కోరారు. పోలీసులు అందుకు అంగీకరించకపోవడంతో అఖిలప్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ముందు నుంచే ఆళ్లగడ్డ రాజకీయం హీటెక్కింది. గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి వర్సెస్ భూమా అఖిలప్రియగా వార్ మొదలయింది. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న కాలంలోఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయోనన్న ఆందోళన ఆళ్లగడ్డ ప్రజల్లో నెలకొంది. మొత్తం మీద కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే ఇలాంటి ఆరోపణలు చేసుకుంటున్నారంటూ సొంత పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *