Uttar Pradesh : సమోసా కోసం గొడవ.. కర్రలు, ఇటుకలు, బ్యాట్లతో ఫైట్..
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఓ అల్పాహార దుకాణం వద్ద మొదలైన చిన్న వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. డబ్బుల లావాదేవీల విషయంలో తలెత్తిన గొడవ కాస్తా రెండు వర్గాల మధ్య వీధి పోరాటానికి దారితీసింది. ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దెహ్రా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దొరికిన వస్తువులతో పరస్పరం దాడులు..
వైరల్ వీడియోలో అర్ధ డజనుకు పైగా వ్యక్తులు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కనిపిస్తోంది. కొందరు కర్రలు, ఇటుకలు, క్రికెట్ బ్యాట్లతో దాడులకు దిగగా.. మరో వ్యక్తి సమోసాలు వేయడానికి ఉపయోగించే పెద్ద గరిటెను పట్టుకుని హల్‌చల్ చేశాడు. ఘర్షణ తీవ్రత పెరగడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటుండగా.. కొందరు మహిళలు, స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ గొడవకు దిగిన వ్యక్తులు వెనక్కి తగ్గకుండా పరస్పరం దాడులు కొనసాగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
వైరల్ వీడియోతో రంగంలోకి పోలీసులు..
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధౌలానా పోలీసులు స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పిల్ఖువా సర్కిల్ ఆఫీసర్ మునేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే వర్గానికి చెందిన ఇద్దరి మధ్య డబ్బుల లావాదేవీ విషయంలో ఈ వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు. వైరల్ వీడియో ఆధారంగా ఘర్షణలో పాల్గొన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.