Mobile Prepaid 30 Days : ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 30 రోజుల రీఛార్జ్ ప్లాన్స్!

మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు సంబంధించి టెలికాం రంగంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు అదనంగా 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలను TRAI ఆదేశించినట్లు ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. దీంతో ప్రతి నెలా 28 రోజుల వ్యాలిడిటీ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం వాయిస్ + SMS మాత్రమే ఉండే ప్రత్యేక ప్లాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, కేవలం కాల్స్ కోసం మొబైల్ ఉపయోగించే వారు, తక్కువ బడ్జెట్‌లో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ ప్లాన్లు ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త నిబంధనలతో ప్రీపెయిడ్ కస్టమర్లకు తమ అవసరాలకు అనుగుణంగా మరిన్ని రీఛార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయని రాఘవ్ చద్దా తెలిపారు.

ఏడాదికి 13 రీఛార్జ్‌లు.. ఇక 12కే పరిమితం!

ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న నెలవారీ ప్లాన్ల కారణంగా ఏడాదిలో 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుందని రాఘవ్ చద్దా తెలిపారు. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు అందుబాటులోకి వస్తే.. ఏడాదికి 13 సార్లు కాకుండా 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

డేటా అవసరం లేదా? ఇక వాయిస్‌-ఓన్లీ ప్లాన్లు!

ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్-ఓన్లీ ప్లాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటిలో కాల్స్‌తో పాటు SMS సదుపాయం ఉండేలా ప్లాన్లు రూపొందించాలని TRAI ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, తక్కువ బడ్జెట్‌లో మొబైల్ వినియోగించే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడే అవకాశం ఉంది.

పార్లమెంట్‌లో లేవనెత్తిన సమస్యకు పరిష్కారం!

రీఛార్జ్ ప్లాన్లలో పరిమితమైన ఆప్షన్లపై వినియోగదారుల నుంచి వచ్చిన ఆందోళనలను మార్చి 11న పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు రాఘవ్ చద్దా తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, TRAIకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *