MOVIE :ప్రివ్యూలు చూసి ఫ్లాప్ అనుకున్నారు.. కానీ నాగార్జున నమ్మకం నిజమైంది! గీతాంజలి వెనుక ఆసక్తికర విషయాలు

ఒక సినిమా… ప్రేమకు కొత్త అర్థం చెప్పింది..! విషాదాన్ని కూడా అందమైన అనుభూతిగా మార్చి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ చిత్రంలోని భావోద్వేగాలు, సంగీతం, పాత్రలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ గురించి ఓ సినీ విశ్లేషకుడు చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ సినిమా వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినీ చరిత్రలో ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన చిత్రాల్లో గీతాంజలి పేరు ఎప్పటికీ ముందుంటుంది. కింగ్ నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రంపై ప్రముఖ సినీ విశ్లేషకుడు చిల్లగట్టు శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో… ‘గీతాంజలి’ ఓ సాధారణ ప్రేమకథ కాదు… అది తెరపై ఆవిష్కరించిన ఓ కవితాత్మక దృశ్యకావ్యం. ఈ సినిమా విజయానికి మణిరత్నం దర్శకత్వంతో పాటు ప్రతి పాత్రను అద్భుతంగా మలిచిన నటీనటుల నటనే ప్రధాన బలమని చెప్పారు. ముఖ్యంగా నాగార్జున తల్లి పాత్రలో సుమిత్ర, గీతాంజలి తండ్రిగా విజయ్ కుమార్, నాగార్జున తండ్రిగా విజయ్ చందర్, బామ్మ పాత్రలో రాధాభాయి తమ సహజ నటనతో కథకు మరింత బలం చేకూర్చారని ఆయన కొనియాడారు.

అంతేకాదు… ఈ చిత్రంలో సుత్తివేలు కామెడీ కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని శ్రీకాంత్ తెలిపారు. విషాద ప్రేమకథలోనూ ప్రేక్షకులకు చిరునవ్వు తెప్పించేలా మణిరత్నం హాస్యాన్ని మేళవించిన తీరు ఆయన సృజనాత్మకతకు నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా సుత్తివేలు, డిస్కో శాంతిపై తెరకెక్కిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిందని గుర్తు చేశారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే… క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇద్దరు యువతీయువకుల ప్రేమకథను ఎక్కడా భారంగా కాకుండా, ఎంతో అందంగా, భావోద్వేగాలతో నిండిన ప్రయాణంలా మణిరత్నం తెరపై చూపించారని చెప్పారు. అదే ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక శ్రీకాంత్ గీతాంజలి సినిమా గురించి వెల్లడించిన మరో విశేషం ఏమిటంటే… సినిమా ప్రివ్యూలు చూసిన తర్వాత చాలామంది ఇది పెద్దగా ఆడదని భావించారట. కానీ నాగార్జున మాత్రం ‘గీతాంజలి’ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారని తెలిపారు. చివరికి అదే నిజమై… సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు మణిరత్నం విజన్‌కు ఇళయరాజా అమర సంగీతం తోడవడం, నాగార్జున-గిరిజల అద్భుత కెమిస్ట్రీ, నాగార్జున డిఫరెంట్ లుక్, గిరిజ సహజ నటన… ఇవన్నీ కలిసి గీతాంజలిని తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్‌గా మార్చాయి. అందుకే… దశాబ్దాలు గడిచినా ఈ సినిమా గురించి మాట్లాడుకునే అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *