PK: బీజేపీ కంచుకోటలో కొత్త చరిత్ర..! నాయకత్వ మార్పుపై ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్.. బీజేపీకి కొత్త సవాల్
బంకీపూర్ ఉప ఎన్నికల విజయంతో ఉత్సాహంలో ఉన్న ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అధిష్టానానికి కీలక సూచనలు చేశారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. దశాబ్దాలుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్న ఈ నియోజకవర్గంలో గెలుపొందడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి బలమైన స్థావరంగా ఉంది. దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయాలు సాధిస్తూ వచ్చారు. అయితే తాజా ఉప ఎన్నికల్లో ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలిచిన ప్రశాంత్ కిశోర్.. తన రాజకీయ ప్రస్థానంలో కీలక విజయాన్ని నమోదు చేశారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యం
విజయం అనంతరం ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. బంకీపూర్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం తన ప్రధాన బాధ్యత అని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు.
బంకీపూర్‌లో మార్పులు ఒక్క రోజులో జరగవని, అయితే రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను ఆచరణ సాధ్యం కాని భారీ హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు.
అభివృద్ధిపైనే రాజకీయ దృష్టి
ఎమ్మెల్యేగా ఎన్నికైనంత మాత్రాన బంకీపూర్ వెంటనే మరో పెద్ద నగరంగా మారిపోదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. కానీ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తామని తెలిపారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని.. అయితే ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అసలైన లక్ష్యంగా ఉండాలని ఆయన అన్నారు.
బీజేపీ నాయకత్వానికి కీలక సందేశం
మరోవైపు బంకీపూర్ ప్రజలు బీజేపీ నాయకత్వానికి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బిహార్‌కు సమర్థవంతమైన, నిజాయితీ గల నాయకత్వం అవసరమని సూచించారు.
ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని.. కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ఉండాలని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారు అనే దానికంటే బిహార్ అభివృద్ధి చెందడం ముఖ్యమని స్పష్టం చేశారు.
మారనున్న బిహార్ రాజకీయ సమీకరణాలా?
బీజేపీకి బలమైన ప్రాంతంగా ఉన్న బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించడం కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. ఈ విజయం జన్‌సూరజ్ పార్టీ భవిష్యత్ రాజకీయాలకు ఎంతటి బలాన్ని ఇస్తుంది..? బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.