ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ యాత్రలో చిక్కుకున్న ఏపీ యాత్రికులు..!
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటంతో కేదార్నాథ్ యాత్ర మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 45 మంది యాత్రికులతో పాటు వేలాది మంది భక్తులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు.
స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదం..!
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన సుమారు 45 మంది యాత్రికులు సెప్టెంబర్ 11న కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. సెప్టెంబర్ 26న స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న వారు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. డోలీల ద్వారా గౌరీకుండ్ వైపు వస్తుండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి మార్గం మూసుకుపోయింది. దీంతో వారి ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. అయితే యాత్రికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
భారీ వర్షాలతో నిలిచిన యాత్ర
సెప్టెంబర్ 27న రుద్రప్రయాగ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండలపై నుంచి పెద్ద బండరాళ్లు, మట్టి రహదారులపైకి వచ్చి పడ్డాయి. దీంతో కేదార్నాథ్-గౌరీకుండ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు యాత్రికులను మార్గమధ్యంలోనే నిలిపివేశారు. దాదాపు 4,000 మందికి పైగా భక్తులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
రంగంలోకి సహాయక బృందాలు
హిమాలయ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కొనసాగుతోంది. కేదార్నాథ్-గౌరీకుండ్ మార్గంలో రహదారి పునరుద్ధరణ పనులను అధికారులు ముమ్మరం చేశారు. విపత్తు నిర్వహణ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు.. మార్గం పూర్తిగా సురక్షితంగా మారే వరకు యాత్రను పునఃప్రారంభించబోమని స్పష్టం చేశారు.
యాత్రికుల కుటుంబాల్లో ఆందోళన
కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 45 మంది యాత్రికులు కొండచరియల కారణంగా మార్గమధ్యంలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే యాత్రికులంతా క్షేమంగా ఉన్నారన్న సమాచారం కుటుంబాలకు కొంత ఊరట కలిగిస్తోంది. రహదారి పునరుద్ధరణ పూర్తయిన తర్వాత వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.