Weather Report: మరో రెయిన్ అలర్ట్..! ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. కాబట్టి ఏ రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

గత పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు ప్రకటించాయి.
ముందుగా తెలంగాణ విషయానికి వస్తే… హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, రానున్న కొన్ని గంటల్లో హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాయంత్రం 7 గంటల వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా సంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాల ప్రభావం కొనసాగనుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, ఎస్.కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంతో పాటు పిడుగుల ముప్పు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు, పిడుగుల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు.