MOVIE: ఎవర్గ్రీన్ క్లాసిక్ చిత్రం అన్నమయ్య..వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం మొదట శోభన్ బాబును సంప్రదించిన మేకర్స్
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్లాసిక్ సినిమా అన్పమయ్య.. ఇందులో వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం మొదట ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించిన మేకర్స్. కానీ చివరి నిమిషంలో జరిగిన ఒక నిర్ణయం ఆ పాత్రను మరో నటుడి చేతికి తీసుకెళ్లింది.

తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం దక్కించుకున్న చిత్రాల్లో ‘అన్నమయ్య’ఒకటి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి, భక్తకవి తాళ్లపాక అన్నమాచార్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 1997లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో నాగార్జున అన్నమయ్యగా తన కెరీర్లోనే గుర్తుండిపోయే నటనను కనబరిచారు. అయితే ఈ సినిమా ఒప్పుకోవడం నాగార్జునకు అప్పట్లో చిన్న విషయం కాదు. వరుస హిట్లతో లవర్ బాయ్, కమర్షియల్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో భక్తిరస ప్రధానమైన సినిమాలో నటిస్తానని ప్రకటించడంతో అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. కానీ కథపై, దర్శకుడిపై నమ్మకంతో ఆయన ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. విడుదల తర్వాత ఆ నిర్ణయం ఎంత సరైనదో సినిమా ఘన విజయం నిరూపించింది.
అయితే నాగార్జున అన్నమయ్య పాత్రకు ఫిక్స్ అయిన తర్వాత మరో కీలకమైన పాత్రపై చిత్రబృందం దృష్టి పెట్టింది. అదే శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్ర. ఈ పాత్ర కోసం మొదట సీనియర్ హీరో శోభన్ బాబును సంప్రదించినట్లు ప్రచారం ఉంది. అయితే అప్పటికే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన, నిర్మాతలు ఒప్పుకోరనే ఉద్దేశంతో అప్పటి కాలానికి చాలా పెద్ద మొత్తంగా భావించిన రూ.50 లక్షల పారితోషకం కోరినట్లు చెబుతారు. ఆ తర్వాత ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరును కూడా పరిశీలించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే అభిమానుల మధ్య అనవసర పోలికలు, చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం.
ఆ తర్వాత చిత్రబృందం సుమన్‌ను సంప్రదించింది. మేకప్ టెస్ట్ నిర్వహించిన వెంటనే ఆయన రూపం, హావభావాలు శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్రకు అచ్చుగుద్దినట్లు సరిపోవడంతో వెంటనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత సుమన్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. తెరపై వెంకటేశ్వరస్వామిగా ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. ఇప్పటికీ ఆ పాత్ర గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు సుమన్‌దే. అదే సమయంలో నాగార్జున – సుమన్ కాంబినేషన్ కూడా ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. అందుకే దాదాపు మూడు దశాబ్దాలు గడిచినా ‘అన్నమయ్య’ తెలుగు సినీ చరిత్రలో ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా కొనసాగుతోంది.