మీకు తెలియని మూసారామ్‌బాగ్ చరిత్ర? ఫ్రెంచ్ అధికారిపై ప్రేమతో హైదరాబాద్ ప్రజలు పెట్టుకున్న పేరు!
HYD : ఇప్పుడు మూసారామ్‌బాగ్ అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది ట్రాఫిక్, మెట్రో, రద్దీ ప్రాంతం మాత్రమే. కానీ ఈ పేరు వెనుక ఒక ఫ్రెంచ్ అధికారి, హైదరాబాద్ ప్రజల ప్రేమ, చరిత్రలో నిలిచిపోయిన అనుబంధం దాగి ఉందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.


హైదరాబాద్‌లో ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేస్ మూసారాంబాగ్. ఈ ముసారాంబాగ్ పేరు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉందని మీలో ఎంత మందికి తెలుసు. భారతదేశ మ్యాప్‌లో ఒక విదేశీయుడి పేరు శాశ్వతంగా నిలిచిపోవడం అరుదు. అతను రాజు కాదు, కేవలం ఒక సాధారణ సైనికుడు. వేరే ఖండం నుంచి వచ్చి.. హైదరాబాద్‌కు చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా ఒక ప్రాంతానికే అతని పేరు పెట్టారు. ఆయనే ఫ్రెంచ్ జనరల్ మిచెల్ రేమండ్.. ఆయన వారసత్వమే నేటి మూసారాంబాగ్. 18వ శతాబ్దం చివరి నాటికి, ప్రపంచం వేగంగా మారుతున్న సమయంలో నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ భవిష్యత్తు గురించి దూరదృష్టితో ఆలోచించారు. విదేశీ శక్తులపై ఆధారపడకుండా, తన సొంత బలమైన సైన్యం, ఆయుధాలు ఉండాలని ఆయన ఆశించారు. ఈ కలను నిజం చేయడానికి, 1784లో ఇంకా కొన్ని ఆధారాల ప్రకారం 1786లో, ఫ్రెంచ్ అధికారి మిచెల్ రేమండ్ హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది.
మిచెల్ రేమండ్ రాకతో..
రేమండ్ హైదరాబాద్ వచ్చిన వెంటనే, సొంత ఆయుధాలు లేని సైన్యం ఎంత నిస్సహాయంగా ఉంటుందో నిజాంకు వివరించారు. ఆ సమయంలో ఆయుధాలను దిగుమతి చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదట. అలాగే సమయానికి అందేవి కావు. అప్పుడు రేమండ్ ఒక విప్లవాత్మక ప్రతిపాదన చేశారట. మనం మన ఫిరంగులను హైదరాబాద్‌లోనే ఎందుకు తయారు చేసుకోకూడదు అని అన్నారు. దానికి నిజాం వెంటనే అంగీకరించారు. అలా ఈ రోజు మనం గన్‌ఫౌండ్రీ అని పిలుస్తున్న ప్రదేశానికి పునాది పడింది. గన్‌ఫౌండ్రీ స్థాపించబడిన తర్వాత, రేమండ్ నిజాం సైన్యానికి యూరోపియన్ శైలిలో కఠినమైన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కొత్త ఫిరంగులు, క్రమశిక్షణతో కూడిన శిక్షణతో, రేమండ్ ఆధ్వర్యంలో సైన్యం సంఖ్య 14,000కు చేరుకుంది. ఆ రోజుల్లో ఏ భారతీయ పాలకుడి వద్దనైనా యూరోపియన్ పద్ధతిలో శిక్షణ పొందిన అతిపెద్ద సైన్యాలలో ఇది ఒకటి. హైదరాబాద్ ఈ పెరుగుతున్న శక్తిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆందోళనగా గమనించింది. స్వతంత్ర, శక్తివంతమైన హైదరాబాద్ వారి ఆధిపత్యానికి ముప్పు అని వారు గ్రహించారు.
రేమండ్ వ్యక్తిత్వం..
ఈ కథలో అత్యంత ముఖ్యమైన భాగం రేమండ్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన కేవలం గొప్ప జనరల్ మాత్రమే కాదు.. ఉదారమైన వ్యక్తి కూడా. ఆయన స్థానిక సంప్రదాయాలను హృదయపూర్వకంగా గౌరవించేవారు కూడా. అన్ని భాషలు నేర్చుకుని.. సైనికులతో ఎల్లప్పుడూ న్యాయంగా వ్యవహరించారు. క్రమంగా ప్రజలు ఆయనను విదేశీయుడిగా చూడటం మానేశారు. ఇక్కడి ముస్లింలు ఆయనను అత్యంత భక్తితో మూసా రహీమ్ అని, హిందువులు ప్రేమతో మూసా రామ్ అని పిలిచారు. ఇది హైదరాబాద్ నిజమైన గంగా-జమున తెహజీబ్‌ను ప్రతిబింబిస్తుంది.
కన్నీళ్లు.. బాధాకరమైన మలుపు
ఇలా అంతా బాగా సాగుతున్న టైమ్‌లో చరిత్ర ఒక ఆకస్మిక, బాధాకరమైన మలుపు తీసుకుంది. 1798లో 43 సంవత్సరాల వయస్సులో మాన్సియర్ రేమండ్ అకస్మాత్తుగా మరణించారన్న వార్త నగరాన్ని కలచివేసింది. ప్రభుత్వ పత్రాలలో ఆయన మరణానికి కారణం అకస్మాత్తు అనారోగ్యంగా లిఖించారు. అయితే చరిత్ర పుటలలో ఆయనకు పెరుగుతున్న శక్తి, బ్రిటిష్ వారికి ముప్పుగా మారడంతో ఆయనకు విషం ఇచ్చారనే వాదన కూడా లేక పోలేదు. దానికి బలమైన రుజువులు లేవట.. బహుశా అది ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది.
ఆయన మరణ వార్త నగరం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచింది. సైనికులు వెక్కివెక్కి ఏడ్చారు. సామాన్య ప్రజలు ఆయనకు చివరి వీడ్కోలు పలకడానికి గుమిగూడారు. నిజాం అలీ ఖాన్ కూడా తన నమ్మకమైన అధికారి మరణానికి ఎంతో బాధపడ్డారు. ప్రజలకు ఇది ఒక విదేశీ జనరల్ మరణం కాదు, తమ మూసా రహీమ్‌ను కోల్పోయిన విషాదం. ఆయన మరణానంతరం చాలా సంవత్సరాల వరకు ప్రజలు ఆయన సమాధిపై పువ్వులు, అగరుబత్తులు వెలిగించారు. రేమండ్ ఎప్పుడూ ఏ వ్యక్తి నమ్మకాన్ని అవమానించలేదట. అలాగే స్థానిక ప్రజల మతపరమైన మనోభావాలను ఎల్లప్పుడూ గౌరవించారని చరిత్ర తెలిసిన వారు చెబుతుంటారు. ఇక ఆయన గౌరవానికి ప్రతిఫలంగానే ముస్లింలు ఆయనను మూసా రహీమ్‌గా, హిందువులు మూసా రామ్‌గా స్వీకరించారు. రేమండ్‌ను మూసీ నది దగ్గర ఒక చిన్న, ప్రశాంతమైన కొండపై ఖననం చేశారు. తర్వాత ఆ సమాధి చుట్టూ చాలా అందమైన, దట్టమైన తోటలు నాటారు. ప్రజలు ప్రేమతో ఈ ప్రదేశాన్ని మూసా రామ్ కా బాగ్ అని పిలవడం ప్రారంభించారు. కాలం గడిచింది, శతాబ్దాలు మారాయి, భాష, యాసలు మారాయి, ఆ మూసా రామ్ కా బాగ్ నెమ్మదిగా కుదించుకుపోయింది. ఈ రోజు మనం మూసారాంబాగ్ అని పిలుస్తున్న ప్రాంతంగా మారిపోయింది.
నేటి మూసారాంబాగ్ ఆ గతం నుంచి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, రేమండ్ వారసత్వం, ఆయన అందించిన సేవలు, స్థానిక సంస్కృతి పట్ల ఆయన చూపిన గౌరవం హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయాయి. ఆయన సమాధి, నేడు రేమండ్స్ టూంబ్ అని పిలవబడుతోంది. ఇది హైదరాబాద్‌లోని గంగా-జమున తెహజీబ్‌కు, కలుపుగోలుతనానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది.