విజయ్‌కు సీఎం భద్రత తొలగింపు.. తమిళ రాజకీయాల్లో ఉద్రిక్తత

తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. TVK అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భావించిన విజయ్‌కు గవర్నర్ షాక్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సరైన మెజార్టీ లేని పరిస్థితిలో సీఎంగా ప్రమాణం చేయడం సాధ్యం కాదని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం TVKకు కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే లభించింది. లెఫ్ట్ పార్టీలతో పాటు మరో రెండు చిన్న పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వబోమని ప్రకటించడంతో మెజార్టీ సమీకరణలు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం ఇవ్వాలని విజయ్ గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

ఇక విజయ్‌కు కల్పించిన కాన్వాయ్ మరియు సీఎం స్థాయి భద్రతను రాత్రి నుంచి తొలగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

మరోవైపు DMK, ADMK కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో పళనిస్వామి-స్టాలిన్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలను ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ADMKలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. షణ్ముఖం వర్గం విజయ్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన సుమారు 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పుదుచ్చేరికి వెళ్లినట్లు సమాచారం.

ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకోవాలనే ఉద్దేశ్యం తమకు లేదని, మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన కూడా లేదని చెప్పారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే మహిళలకు నెలకు ₹2500 ఆర్థిక సహాయం అమలు చేయడం సాధ్యం కాదని, ప్రస్తుతం అమల్లో ఉన్న ₹1000 పథకాన్ని కొనసాగించాలని సూచించారు.

ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *