తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. గవర్నర్ భేటీకి సిద్ధమైన విజయ్

తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. TVK అధినేత విజయ్ కాసేపట్లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి లోక్ భవన్ అధికారులతో మాట్లాడి గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడటంతో గవర్నర్ తన కేరళ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ సహకరించడం లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా TVK ఉన్నట్లు సమాచారం. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా TVK నిలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విజయ్ అభిమానులు భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం చెన్నై మెరీనా బీచ్‌కు చేరుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. జల్లికట్టు ఉద్యమాన్ని తలపించేలా భారీ స్థాయిలో గ్యాదరింగ్ జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు, కేంద్ర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మెరీనా బీచ్ పరిసర ప్రాంతాలకు భారీగా కేంద్ర బలగాలను తరలిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు, గవర్నర్ రాజ్ భవన్, ఇతర కీలక ప్రాంతాల్లో నిఘా పెంచాలని కేంద్రం ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన కూడళ్లలో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటే అది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *