Khairatabad Bypoll 2026 : ఖైరతాబాద్ బైపోల్‌పై కవిత ఫోకస్.. టీఆర్ఎస్ పోటీ ఖరారు!
తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రచార ఆర్భాటం తప్ప చేతల్లో మాత్రం చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లోల టీఆర్ఎస్ పోటీ చేస్తుందని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు, ప్రజల గొంతుకగా నిలిచేందుకు తమ అభ్యర్థిని బరిలోకి దించుతామని ఆమె స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ ఫామ్‌హౌస్ (KTR Farmhouse) వ్యవహారం పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. ఇదంతా నాయకుల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాల్లో భాగమేనని, ఫామ్‌హౌస్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోదని ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేస్తామన్నారు. దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. తమ పార్టీ తరఫున ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ తొలి వేదికగా ఎంచుకున్నట్లు కవిత స్పష్టం చేశారు.
దానంపై అనర్హత వేటు పడటానికి కారణాలివే..
దానం నాగేందర్ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి BRS పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీలో చేరలేదని చెబుతూనే అదే కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం, ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధి ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నా లేదా మరొక పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేసినా ఆ వ్యక్తి తన శాసనసభ సభ్యత్వానికి అనర్హుడవుతారు. బిఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల నామినేషన్ వేయడం ఆయనపై అనర్హత వేటుకు కారణమైంది.
తెలంగాణ హైకోర్టు తీర్పు వివరాలు..
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే అల్లేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిశీలించినా.. అందులో వాస్తవం లేదంటూ డిస్మిస్ చేశారు. దాంతో వారిద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ (చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎమ్. మోహియుద్దీన్), స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను తప్పుపడుతూ 2026 సెప్టెంబర్ 18న సంచలన తీర్పునిచ్చింది. నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా నామినేషన్ వేసిన ఏప్రిల్ 23, 2024 నుంచే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యాడని స్పష్టం చేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దానం నాగేందర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2026 సెప్టెంబర్ 24న ఆ పిటిషన్ కొట్టివేసింది. బిఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చినా లేదా ఆ పార్టీ మిమ్మల్ని అంగీకరించినా ఎమ్మెల్యే పదవి దక్కదు, మీరు ఎమ్మెల్యేగా ఫిరాయింపులకు పాల్పడిన క్షణమే మీ సభ్యత్వం రద్దవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని తీర్పిచ్చింది. దాంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.