Varanasi : రాజమౌళి వారణాసి మూవీకి లీకుల బెడద.. 20 సెకన్ల వీడియో లీక్‌..

ఓ గ్లోబల్‌ సినిమా నుంచి ఇంకా అధికారికంగా ఒక్క సీన్ కూడా విడుదల కాలేదు… కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్లాది మంది ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ఈ లీక్ నిజంగానే షాకిచ్చింది? అసలు ఆ వీడియో వెనుక ఉన్న కథేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా నుంచి ఓ భారీ యాక్షన్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు పుట్టినరోజుకు ముందే ఈ వీడియో బయటకు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వారణాసి ఘాట్స్‌లో చిత్రీకరించినట్లు కనిపిస్తున్న ఈ క్లిప్‌లో మహేశ్ బాబు రక్తసిక్తమైన లుక్‌లో కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో నిజంగానే సినిమా ఫుటేజేనా? లేక ఫేక్ వీడియోనా? అనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే మొదటిసారి కూడా కాదు. గతంలో సెట్స్ ఫొటోలు, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌తో పాటు మరికొన్ని కీలక వివరాలు కూడా అధికారిక ప్రకటనకు ముందే లీక్ అయ్యాయి. దీంతో సినిమా సెట్‌లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.

ఇక రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాశీ నుంచి ప్రారంభమయ్యే ఈ కథ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వరకు సాగనుంది. ఇప్పటికే షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు సమాచారం. కీలక యాక్షన్ సన్నివేశాలు పూర్తి కాగా, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తాజా లీక్ సినిమాపై మరింత హైప్ పెంచుతుందా? లేక మేకర్స్‌కు కొత్త తలనొప్పిగా మారుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *