వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు మొదలవగా, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడు అరేబియా సముద్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి విస్తరించిందని, ఈ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన..
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది
తెలంగాణలో జిల్లాలకు వర్ష సూచన..
ఇక తెలంగాణలో… ఈ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచాన వేశాయి. అందులో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని.. జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే వారంలో ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సూచించింది వాతావరణ శాఖ.
Suresh