MOVIE : ఆ హీరోయిన్‌ను ముట్టుకుంటే షాక్ తగులుతుంది జాగ్రత్త.. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న కొత్త చిత్రం!
థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన ఓ సినిమా… ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదృష్టం పరీక్షించుకోబోతోంది. రిలీజ్ సమయంలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఆ మూవీ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మరి ఆ సినిమా ఏది..? ఎప్పటి నుంచి ఓటీటీలోకి రాబోతోందో తెలుసుకుందామా.

యంగ్ హీరో తిరువీర్, తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన ఓ సుకుమారి సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నూతన దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ గ్రామీణ కామెడీ ఎంటర్‌టైనర్ జూలై 17న థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌ను తాకితే కరెంట్ షాక్ కొడుతుంది అనే వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాపై మొదట మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడంలో సినిమా కాస్త వెనుకబడటంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితానికే పరిమితమైంది.
అయితే ఇటీవల థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోని చాలా సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అదే ఆశతో ఇప్పుడు ఓ సుకుమారి కూడా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా ఒకేసారి అందుబాటులోకి రానుంది.
ఇక గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ ఓ సుకుమారి సినిమాలో ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆమని, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. భరత్ మంచీరాజు సంగీతం అందించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఓ సుకుమారి.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.