MOVIE: 2026 Box Office War.. 1000 కోట్ల క్లబ్‌లో ఎవరు..? వెయ్యి కోట్ల కోసం స్టార్ హీరోల మహా పోరు..!

2026 చివరి నాలుగు నెలలు ఇండియన్ బాక్సాఫీస్‌కు అగ్నిపరీక్షలా మారనున్నాయి. యశ్, ప్రభాస్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు తమ భారీ పాన్ ఇండియా సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో వెయ్యి కోట్ల క్లబ్‌ను ఎవరు టచ్ చేస్తారు? ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుడు 100 కోట్ల సినిమా అంటేనే పెద్ద విషయం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత ప్రతి స్టార్ హీరో, ప్రతి పెద్ద బ్యానర్ లక్ష్యం ఒక్కటే… వెయ్యి కోట్ల క్లబ్. ముఖ్యంగా 2026 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విడుదల కానున్న సినిమాల లైనప్ చూస్తే, ఇండియన్ బాక్సాఫీస్‌లో మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ముందుగా శాండిల్‌వుడ్ గురించి మాట్లాడితే… కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యశ్, ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. ప్రస్తుతం హైప్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఒక్క ట్రైలర్ క్లిక్ అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోవచ్చు. కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ కాస్ట్ కూడా టాక్సిక్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

ఇక టాలీవుడ్ కూడా ఈ రేసులో గట్టిగానే బరిలోకి దిగుతోంది. ఆగస్టు 21న ది ప్యారడైజ్, అక్టోబర్ 15న చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, డిసెంబర్ 3న ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాల్లో ముఖ్యంగా ఫౌజీపై ఇప్పటికే వెయ్యి కోట్ల సినిమా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. హను రాఘవపూడి ఎమోషన్స్ మరోసారి మ్యాజిక్ చేస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం సాధించిన విజయంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈసారి వెయ్యి కోట్ల మార్క్‌ను తలైవా అందుకుంటాడా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

అదేవిధంగా బాలీవుడ్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. సెప్టెంబర్ 4న మీర్జాపూర్ థియేట్రికల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, నవంబర్‌లో నితీష్ తివారీ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ విడుదల కానుంది. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 23న షారుఖ్ ఖాన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి 2026 చివరి నాలుగు నెలలు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ బాక్సాఫీస్ సీజన్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో ఇండస్ట్రీ తమ బలమైన సినిమాలను బరిలోకి దింపుతోంది. అయితే భారీ బడ్జెట్‌లు, స్టార్ కాస్ట్, పాన్ ఇండియా రిలీజ్‌లు మాత్రమే విజయాన్ని నిర్ణయించవు. ప్రేక్షకులను మెప్పించే బలమైన కంటెంట్ ఉన్న సినిమానే చివరికి వెయ్యి కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుంది. మరి ఈ బాక్సాఫీస్ పోరులో అసలు విజేత ఎవరు అవుతారో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *