Health: కమ్మటి కాఫీ తాగి ఓ చిన్న కునుకు వేయండి.. మెదడు పనితీరు పెరుగుతుందా? ఇదే కాఫీ నాప్ రహస్యం!

చాలామంది కాఫీ తాగితే నిద్ర దూరమవుతుందని అనుకుంటారు. కానీ, సరైన సమయంలో కాఫీ తాగి కాసేపు నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన పద్ధతినే కాఫీ నాప్ అని పిలుస్తారు.

పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత నీరసం, మత్తుగా అనిపించడం సహజం. అలాంటి సమయంలో కొందరు కాఫీ తాగుతారు… మరికొందరు చిన్న కునుకు తీసుకుంటారు. అయితే ఈ రెండింటినీ కలిపి చేస్తే శరీరానికి, మెదడుకు మరింత ప్రయోజనం కలుగుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఒక కప్పు కాఫీ తాగి వెంటనే 15 నుంచి 20 నిమిషాల పాటు కళ్లను మూసుకుంటే… నిద్రలేచిన తర్వాత సాధారణంగా కాఫీ తాగినా, కునుకు తీసుకున్నా కలగని స్థాయిలో ఉత్సాహం అనిపిస్తుందని చెబుతారు. ఇదే కాఫీ నాప్ ఎఫెక్ట్.

కాఫీ నాప్ ఎలా పనిచేస్తుంది?

మనిషి మెలకువగా ఉన్న సమయంలో మెదడులో అడెనోసిన్ అనే రసాయనం పేరుకుపోతుంది. ఇది క్రమంగా నిద్రమత్తును పెంచుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ మెదడులోని అడెనోసిన్ రిసెప్టర్లను అడ్డుకుంటుంది.

కాఫీ తాగిన వెంటనే చిన్న కునుకు తీసుకోవడం వల్ల… నిద్ర సమయంలో శరీరం కొంత అడెనోసిన్‌ను తగ్గిస్తుంది. ఆ తర్వాత కెఫీన్ ప్రభావం మొదలయ్యే సమయానికి మెదడు మరింత చురుగ్గా మారుతుంది. దీంతో ఏకాగ్రత, అప్రమత్తత పెరిగే అవకాశం ఉంటుంది.

కాఫీ నాప్ వల్ల కలిగే ప్రయోజనాలు:

  • అలసట, నిద్రమత్తు తగ్గించడంలో సహాయం చేస్తుంది.
  • ఏకాగ్రత, దృష్టి సామర్థ్యం పెరగడానికి ఉపయోగపడుతుంది.
  • జ్ఞాపకశక్తి, సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యానికి తోడ్పడుతుంది.
  • వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, స్పందించే సామర్థ్యం మెరుగుపడొచ్చు.
  • రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసే వారికి తాత్కాలికంగా అప్రమత్తత పెంచడంలో సహాయపడవచ్చు.

అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి:

కాఫీ నాప్ అంటే గంటల తరబడి నిద్రపోవడం కాదు. కేవలం 15 నుంచి 20 నిమిషాల చిన్న కునుకు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ సమయం నిద్రపోతే గాఢ నిద్రలోకి వెళ్లి లేవగానే అలసటగా అనిపించే అవకాశం ఉంటుంది.

అలాగే రాత్రి సమయాల్లో కాఫీ నాప్ తీసుకోవడం మంచిది కాదు. ఇది రాత్రి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటలలోపు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కాబట్టి, అలసటగా అనిపించిన ప్రతిసారి ఎక్కువ కాఫీ తాగడం కంటే… సరైన సమయంలో ఒక కప్పు కాఫీతో పాటు 20 నిమిషాల చిన్న కునుకు తీసి చూడండి. ఈ చిన్న అలవాటు మీకు ఎంత ఫ్రెష్‌నెస్ ఇస్తుందో మీరే గమనించవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *