Movie : సెన్సార్ మార్పులతో ‘జన నాయగన్’ విడుదలకు ముందు కీలక మార్పులు..20 సెకన్ల సీన్లపై కీలక ఆదేశాలు

దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. అయితే సెన్సార్ బోర్డు ఏకంగా 20 సెకన్ల తొలగింపులు, 10 సెకన్ల రీప్లేస్‌మెంట్లు సూచించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ సినిమాలో ఏయే సన్నివేశాల్లో మార్పులు చేశారు? లేట్ ఎందుకు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని, ఇకపై సినిమాల్లో నటించనని విజయ్ గతంలో ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విజయ్.. తన చివరి సినిమాతో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ విడుదలకు మార్గం సుగమమైంది. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే విడుదలకు ముందు సెన్సార్ బోర్డు పలు మార్పులు సూచించింది.

సెన్సార్ సూచనల ప్రకారం.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విజువల్స్ ఉన్న పుస్తక కవర్‌ను మార్చారు. అలాగే ‘టీవీకే’ పదం ఉన్న డైలాగ్‌ను మ్యూట్ చేయడంతో పాటు ఆడియో, వీడియోల్లోనూ మార్పులు చేశారు. భారత జాతీయ జెండా కింద పడినట్లు ఉన్న విజువల్‌ను పూర్తిగా తొలగించారు. కొన్ని పదాలు, అభ్యంతరకర డైలాగ్‌లను మ్యూట్ చేయడంతో పాటు ‘ఓం’ పదాన్ని కూడా తొలగించారు. ఆపరేషన్ మెలూహా సీన్‌లోని కొన్ని డైలాగ్‌లను సవరించారు.

అంతేకాదు.. జిల్లా కలెక్టర్ బ్యాడ్జ్‌ను అగౌరవపరిచేలా ఉన్న విజువల్‌ను తొలగించి కొత్త షాట్‌ను జత చేశారు. చిన్నారిని తగలబెట్టే సన్నివేశాన్ని పూర్తిగా తీసేశారు. అలాగే ‘శీలా రాణి’ అనే పేరును మార్చాలని కూడా సెన్సార్ బోర్డు సూచించింది. మొత్తంగా 20 సెకన్ల తొలగింపులు, 10 సెకన్ల రీప్లేస్‌మెంట్లు చేసినప్పటికీ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు (183 నిమిషాల 11 సెకన్లు)గానే ఉంది. మరి విజయ్ చివరి సినిమాగా వస్తున్న ‘జన నాయగన్’ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *