- Suresh BRK
- July 8, 2026
- Latest Update: July 8, 2026 2:37 pm
- 50
- Less than a minute
- 0
కిరాక్ RP చేపల పులుసు వ్యాపార వైఫల్యానికి గల కారణాలను ప్రముఖ ప్రొడక్షన్ మేనేజర్ పచ్చళ్ల ప్రకాష్ వివరించారు. నాణ్యతను కాపాడుకోకపోవడం వల్లే ఆర్పీ బ్రాంచ్‌లు మూతపడ్డాయని తెలిపారు. అంతేకాకుండా, తాను ఒక ప్రముఖ హీరోయిన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినట్లు కూడా తెలిపారు. తన కుమారుడి సినీరంగ ప్రవేశం, పవన్ కళ్యాణ్ కుటుంబంతో తన అనుబంధం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

సినీ రంగంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పచ్చళ్ల ప్రకాష్. ఆయన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ఫేమ్ కిరాక్ RPకి ఉన్న నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు వ్యాపారం ఎందుకు ఫెయిల్ అయ్యిందో ప్రకాష్ స్పష్టంగా చెప్పారు. కిరాక్ RPకి ఫుడ్ బిజినెస్‌లో సహాయం చేయడానికి ప్రకాష్ ముందుకు వచ్చారట. నాలుగు ఐటమ్స్‌తో వ్యాపారం ప్రారంభించాలని RP అనుకున్నప్పుడు, ప్రకాష్ అది సాధ్యం కాదని, క్వాలిటీ, టేస్ట్ మెయింటైన్ చేస్తూ కర్రీ పాయింట్ పెట్టమని సలహా ఇచ్చారు. ప్రకాష్ సహాయంతో కిచెన్ ఓపెనింగ్ చేసి, నాలుగు బ్రాంచ్‌లు కూడా ఓపెన్ చేశారు ఆర్పీ. ఆపై తనకున్న పరిచయాలు, ఫేమ్‌తో వ్యాపారాన్ని బ్రాంచులుగా విస్తరించారు. డబ్బు కట్టిన వారికి బ్రాంచులు కూడా ఇచ్చాడని.. అయితే క్వాలిటీతో పాటు ధర విషయంలో నెట్టింట చాలామంది కామెంట్స్ పెడుతూ వచ్చారని వివరించారు. దీంతో తర్వాత కాలంలో వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో RP వాటిని నిలబెట్టుకోలేకపోయారన్నారు ప్రకాశ్.
చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు వంటివి సరిగా లేవని కస్టమర్లు ఫిర్యాదులు చేసినా, RP వాటిని సరిదిద్దుకోవడంలో విఫలమయ్యారని ప్రకాష్ తెలిపారు. నాణ్యత, నిలకడైన రుచిని అందించడంలో లోపం వల్లే అన్ని బ్రాంచ్‌లు మూతపడ్డాయని, RP స్వయంగా తన వ్యాపారాన్ని నాశనం చేసుకున్నారని ప్రకాష్ అభిప్రాయపడ్డారు. తన చేపల దుకాణాలు బంద్ పెట్టిన ఆర్పీ ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఇక పచ్చళ్ల ప్రకాష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో నాణ్యత, నిబద్ధతలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో వివరించారు. 40 ఏళ్లుగా షూటింగ్‌లకు ఫుడ్ సప్లై చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం నాణ్యత, శుభ్రత, రుచిని ఎప్పుడూ కాపాడుకోవడమేనని ఆయన అన్నారు. క్యాటరింగ్ వ్యాపారంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించి విజయం సాధించానని తెలిపారు. డబ్బు కంటే పేరే ముఖ్యమని, పేరు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు.
అలా ఆ ఇంటర్వ్యూలో ప్రకాష్ ఒక సంచలన విషయాన్ని కూడా వెల్లడించారు. తాను ఒక ప్రముఖ హీరోయిన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశానని తెలిపారు. నీతోడు కావాలి సినిమా ప్రొడక్షన్ చీఫ్‌గా ఉన్న సమయంలో, 14 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఎనిమిది నెలల పాటు తన ఇంట్లోనే పెట్టుకొని, ఫోటోషూట్లు చేయించి, లారెన్స్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారట. ఆ తర్వాత కృష్ణవంశీ, రమేష్ కృష్ణలు కలిసి తీసిన శ్రీ ఆంజనేయం సినిమాకు ఆమెను హీరోయిన్గా ఎంపిక చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఛార్మీ. శ్రీ ఆంజనేయం తర్వాత ఛార్మీ.. మాస్, స్టైల్, రాఖీ, చక్రం వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిందని ప్రకాష్ పంచుకున్నారు. ఆమె ఇప్పటికీ తనను బాగా చూసుకుంటుందని ప్రకాష్ సంతోషంగా చెప్పారు.
తన కుమారుడి సినీరంగ ప్రవేశం గురించి కూడా ప్రకాష్ ఓపెన్ అయ్యారు. తన కుమారుడు బాల నటుడిగా దేవుళ్ళు, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహాద్రి, ఆది వంటి దాదాపు 46 చిత్రాలలో నటించాడని తెలిపారు. త్వరలో హీరోగా పరిచయం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని, అయితే స్టోరీ ఫైనల్ అవ్వలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని కూడా ప్రకాష్ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు, అఖీరా నందన్, ఆద్య షూటింగ్‌లకు వచ్చినప్పుడు వారికి భోజనం తానే అందిస్తానని అన్నారు. అఖీరా చాలా పొడవుగా, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ కంటే కూడా ఎత్తుగా ఉంటాడని, తప్పకుండా హీరో అవుతాడని ప్రకాష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏది ఎలా ఉన్న ఆర్పీ వ్యాపారం గురించి ప్రకాశ్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.