YSR: వైఎస్‌కు సూరి ఎలా బాడీగార్డ్ అయ్యాడు?.. ఎవ్వరికీ తెలియని ఆశ్చర్యకర ఘటన

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సూరి ఎలా బాడీగార్డ్‌గా చేరారనే అరుదైన సంఘటనను మాజీ ఎంపీ సాయి ప్రతాప్ వెల్లడించారు. చిన్న వయసులోనే అసాధారణ ధైర్యం ప్రదర్శించిన సూరి.. ఆ తర్వాత జీవితాంతం వైఎస్‌కు నిస్వార్థ సేవ అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత సాయి ప్రతాప్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సూరి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైఎస్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్న ఆయన.. సూరి కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదని, ఆయనకు ఆత్మబంధువులా, నిస్వార్థ సేవకుడిగా జీవితాంతం అండగా నిలిచారని చెప్పారు.

సాయి ప్రతాప్ చెప్పిన వివరాల ప్రకారం.. సూరి రాజశేఖర్ రెడ్డి వద్ద బాడీగార్డ్‌గా చేరడం వెనుక ఒక అసాధారణ సంఘటన ఉంది. ఒకసారి పులివెందులలో తాను, వైఎస్ కలిసి కూర్చుని ఉండగా.. నిక్కరు వేసుకున్న ఓ చిన్న బాలుడు వారి దగ్గరకు వచ్చి, “సార్.. నేను మీ దగ్గర బాడీగార్డ్‌గా ఉంటాను” అని చెప్పాడని ఆయన గుర్తు చేసుకున్నారు. సరదాగా స్పందించిన వైఎస్.. “అరే పిల్లోడా.. నువ్వేం బాడీగార్డ్ రా?” అని అడిగినా, ఆ బాలుడు మాత్రం తన నిర్ణయం మార్చుకోకుండా “నేనే మీ బాడీగార్డ్‌గా ఉంటాను” అని పట్టుబట్టాడని తెలిపారు.

అప్పుడు దూరంలో ఉన్న ఓ రాతి గోడను చూపిస్తూ, “నిజంగా అంత ధైర్యం ఉంటే వెళ్లి ఆ గోడకు తల కొట్టురా” అని వైఎస్ సవాల్ విసిరారని సాయి ప్రతాప్ చెప్పారు. అందరూ చూస్తుండగానే ఆ బాలుడు ఏమాత్రం వెనుకాడకుండా పరిగెత్తి వెళ్లి రాతి గోడకు తలను బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయం అయి రక్తం కారడం ప్రారంభమైందన్నారు.

దాంతో ఆశ్చర్యపోయిన రాజశేఖర్ రెడ్డి వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి కుట్లు వేయించారని తెలిపారు. ఆ సమయంలో వైఎస్ వైద్య వృత్తిలో ఉండేవారని గుర్తు చేశారు. అనంతరం “యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్” అని చెప్పి సూరిని తన బాడీగార్డ్‌గా నియమించారని సాయి ప్రతాప్ వెల్లడించారు. ఈ సంఘటన చిన్న వయసులోనే సూరి చూపించిన అసాధారణ ధైర్యానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల అతనికి ఉన్న అచంచలమైన అంకితభావానికి నిదర్శనమని సాయి ప్రతాప్ పేర్కొన్నారు. ఆ తర్వాత సూరి జీవితాన్నే వైఎస్ సేవకు అంకితం చేశారని చెప్పారు.

విజయమ్మ దూరంగా ఉన్న సందర్భాల్లో కూడా వైఎస్‌కు అవసరమైన ఆహారం, మందులు, ఆరోగ్య పరిరక్షణ, ఇతర సౌకర్యాలన్నింటినీ సూరి అహర్నిశలు పర్యవేక్షించేవారని సాయి ప్రతాప్ గుర్తు చేసుకున్నారు. బయటకు కఠినంగా, రౌద్రంగా కనిపించినా.. అతనిది ఎంతో మెత్తని మనసని, వైఎస్ పట్ల అతనికున్న విశ్వాసం, సేవాభావం అసాధారణమని కొనియాడారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *