దేశ రాజధాని ఢిల్లీని (Delhi) యమునా నది (Yamuna River) వరదలు (floods) ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధులు చెరువులను తలపిస్తుండగా, మార్కెట్లు, ఇళ్లు నీటమునిగాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే..
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు (rains) దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోకి భారీగా వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఒక వైపు భారీ వర్షాలు మరో వైపు వరదలు.. ఆ వరద అంతటా పక్కనే ఉన్న హథినీకుండ్ బ్యారేజీ కి (Hatnikund Barrage) పొటెత్తడంతో భారీగా నీటిని విడుదల చేయడంతో ఆ వరద యమునా నది (Yamuna River) పోటెత్తింది. దీంతో వసుదేవ్ ఘాట్ (Vasudev Ghat), యమునా ఘాట్‌లతో పాటు మజ్ను కా టిలా, మదన్‌పూర్ ఖదర్, బదర్‌పూర్ వంటి నివాస ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పాత రైల్వే బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తాత్కాలిక శిబిరాలకు తరలించారు. అయినప్పటికీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చి, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
దయనీయంగా మదన్‌పూర్..
ఇక మదన్‌పూర్ ఖదర్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తమ పూరి గుడిసెలు నీటిలో మునిగిపోవడంతో వందలాది కుటుంబాలు రోడ్డు పక్కన ప్లాస్టిక్ షీట్ల కింద తలదాచుకుంటున్నాయి. “మా సామాన్లన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. కొన్ని మాత్రమే తెచ్చుకోగలిగాం. ముఖ్యంగా మహిళలు టాయిలెట్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని తాయారా అనే మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. వంట సామాగ్రి లేక, కనీసం వండుకోవడానికి కూడా అవకాశం లేక కేవలం బిస్కెట్లు, బన్నులతోనే కడుపు నింపుకుంటున్నామని మరికొందరు వాపోయారు.
డేంజర్ బేల్స్..
దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్ బేల్స్ ని (Danger Bells) మ్రోగిస్తుంది. వర్షాలకు నదిలో నీటి మట్టం బాగా పెరిగిపోయింది. దీంతో నీరంతా సిటీలోకి వచ్చేసింది. యుమునలోని వరద నీరు ప్రమాదకర స్థాయిని దాటి 207.41 మీటర్ల దగ్గర ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్ లోకి నీరు వచ్చి చేరింది. ఢిల్లీ సెక్రటేరియట్ (Delhi Secretariat) లోకి నీరు చేరింది. మయూర్ విహార్‌లోని సహాయ శిబిరం కూడా నీట మునిగిపోయింది. ఐటీఓ క్రాసింగ్ , అలీపూర్ ఫ్లైఓవర్ వద్ద కూడా పరిస్థితి దారుణంగా ఉంది. NH-44లోని అలీపూర్ సమీపంలోని ఫ్లైఓవర్‌లో ఒక భాగం కూలిపోయింది. ఇందులో ఒక కారు చిక్కుపోయింది. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరద నీరు కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ప్రమాదస్థాయిని మించి…
ఢిల్లీలోకి యమునా నది నీరు వచ్చేయడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 1978, 2023లలో ఇలానే జరిగింది. 2023లో యమునా నది నీటి మట్టం 208.66 మీటర్లకు చేరింది. ఇక 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరింది. ప్రస్తుతం కూడా ఇంతే స్థాయిలో యమున ప్రవహిస్తోందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా యమునా బజార్, గీతా కాలనీ, మజ్ను కా తిలా, కాశ్మీరీ గేట్, గర్హి మండు, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. దీంతో దాదాపు 14 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఐటీఓ, మయూర్ విహార్, గీతా కాలనీల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.