తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు తెరపడింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇక తాజాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా.. నవంబర్ 14వ తేదీన ఫలితం వచ్చేస్తుంది. ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది.

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్నామని ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు KCR వైపే ఉన్నారని, తామే విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్లో జరిగిన ఉపఎన్నికలో సత్తా చాటని ‘కారు’ ఈ ఎన్నికలోనైనా స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి. కాంగ్రెస్ గెలిస్తే కొత్త ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు స్పష్టమవుతుంది. బీఆర్‌ఎస్ గెలిస్తే ప్రతిపక్షం ఇంకా బలంగా ఉందని… కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచిందని సూచిస్తుంది. ఫలితం GHMC ఎన్నికలకు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలకు కొత్త దిశను చూపనుంది.