కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత, డాలర్‌తో (Dollar) పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) (HBM) చిప్‌లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో చిప్ తయారీ కంపెనీలు అధిక లాభాలు వచ్చే ఏఐ చిప్‌ల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా టీవీల వంటి పరికరాలకు అవసరమైన చిప్‌ల సరఫరా తగ్గి, వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారి 90 దాటడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఓపెన్‌సెల్, మదర్‌బోర్డు వంటి విడిభాగాల వ్యయం కూడా పెరిగింది.
LED TV ధరలపై క్లారిటీ..
ఈ పరిణామాలతో ఎల్‌ఈడీ టీవీల (LED TVs) ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ సతీశ్ తెలిపారు. అయితే, థామ్సన్, కొడక్ వంటి బ్రాండ్లకు టీవీలు తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో (CEO)అవనీత్ సింగ్ మార్వా (Avneet Singh Marwa) మాత్రం ధరల పెంపు 7 నుంచి 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేశారు. గత మూడేళ్లలో మెమరీ చిప్‌ల ధర ఏకంగా 500 శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు. మరోవైపు ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 (DDR4) ధరలు సోర్సింగ్ స్థాయిలో 1000 శాతం పెరిగాయని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ అన్నారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు ఈ కొరత కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త ధరల ప్రభావం వినియోగదారులపై పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

దిగుమతులపై అధిక ఆధారపడటమే ప్రధాన కారణం..
భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు (Electronics products) తయారవుతున్నప్పటికీ, వాటిలో ఉపయోగించే కీలక భాగాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. మెమొరీ చిప్స్, ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్‌బోర్డులు వంటి కీలక విడిభాగాలు ప్రధానంగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. డాలర్ ధర పెరిగిన కొద్దీ, ఈ భాగాల ఖర్చు కూడా పెరుగుతోంది. దీంతో తయారీ వ్యయం పెరిగి, ధరల పెంపు అనివార్యంగా మారుతోంది.
జనవరి నుంచి LED TVల ధరలు పెరిగే సూచనలు..
పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, జనవరి నుంచి ఎల్‌ఈడీ టీవీల ధరలు సుమారు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా తయారవుతున్న లేదా అసెంబ్లింగ్ జరుగుతున్న టీవీల్లో కూడా దేశీయ విలువ జతచేరుతోంది కేవలం 30 శాతమేనని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్.ఎస్. సతీష్ (N.S. Satish) తెలిపారు. మిగిలిన 70 శాతం భాగాలు విదేశాల నుంచే రావాల్సి వస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం డాలర్ విలువ రూ.90 దాటడంతో, ఈ భారాన్ని పూర్తిగా కంపెనీలు భరించడం కష్టంగా మారిందని చెప్పారు.
GST తగ్గింపుతో గతంలో లభించిన ఊరట..
గత సెప్టెంబరులో ప్రభుత్వం 32 అంగుళాలు మరియు అంతకంటే ఎక్కువ పరిమాణం ఉన్న టీవీలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల టీవీల ధరలు గరిష్టంగా రూ.4,500 వరకు తగ్గాయి. అప్పట్లో మొత్తం ధరల్లో సుమారు 10 శాతం తగ్గుదల కనిపించింది. అయితే ఇప్పుడు జనవరి నుంచి ఆ తగ్గుదలలో కొంత భాగం తిరిగి పెరుగుదల రూపంలో కనిపించే అవకాశం ఉంది. డాలర్ విలువ పెరుగుతున్న క్రమంలో, గత 40 రోజులుగా మొబైల్ ఫోన్ల ధరలు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో, టెలికాం నెట్‌వర్క్ సంస్థలు తమ లాభదాయకతను పెంచుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచడం, పథకాల కాలావధిని తగ్గించడం వంటి మార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రిలయన్స్ జియో మినహా మిగిలిన ప్రధాన టెలికాం సంస్థలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.

రానున్న రోజుల్లో మరిన్ని పెంపులు?
మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal) వంటి బ్రోకరేజ్ సంస్థల (Brokerage firms) అంచనాల ప్రకారం, సమీప భవిష్యత్తులో ఎన్నికలు వంటి పెద్ద రాజకీయ పరిణామాలు లేకపోవడంతో ఇదే టారిఫ్ పెంపుకు అనుకూల సమయమని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి. ఈ నెలలోనే మరిన్ని మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. నెలవారీ అపరిమిత కాల్స్, రోజూ 1.5 జీబీ డేటా కలిగిన పథకాల ధరలు సగటున రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే తక్కువ మొత్తం చెల్లించే కొంతమంది వినియోగదారులను ఎయిర్‌టెల్, జియోకు కోల్పోయింది. అయినప్పటికీ, సంవత్సరాలుగా అదే నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్న కొందరు వినియోగదారులు ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో చాలామంది 365 రోజుల దీర్ఘకాలిక పథకాలను ఎంచుకుంటున్నారు. 5జీ సేవల కోసం కొందరు ఇతర నెట్‌వర్క్‌లకు మారినప్పటికీ, వొడాఫోన్ ఐడియా కూడా ఇప్పుడు క్రమంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.