Tension in Adilabad district.. Lathi charge on farmers, former minister arrested..!

Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత .. రైతులపై లాఠీ ఛార్జి, మాజీ మంత్రి అరెస్ట్..!

ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. సోయా పంటను (Soy crop) వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే..

ఆదిలాబాద్‌ జిల్లాలో సోయా రైతుల (Farmers) పరిస్థితి దయనీయంగా మారింది. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. పంట సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ఆందోళన ఫలితంగా సోమవారం నుంచి ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో సోమవారం ఐదు గ్రామాలకు చెందిన 154 మంది రైతులు 3 వేల క్వింటాళ్ల పంటను తీసుకొచ్చారు. సోమవారం ఉదయం శాంపిళ్లు తీసుకెళ్లిన అధికారులు మధ్యాహ్నం నుంచి కొనగోలు చేస్తామని చెప్పారు. సాయంత్రం వరకు కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు మార్కెట్‌ యార్డులో పడిగాపులు కాశారు. మంగళవారం ఉదయం రైతులు మార్కెట్‌ యార్డు ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్డీవో ఇతర అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారు. నాణ్యత పరీక్షల తర్వాత కేవలం 11 మంది పంటనే కొనుగోలు చేస్తామని, మిగతా వారు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాలని సూచించారు.

సోయా పంట కొనుగోలు చేయాలంటూ రైతుల డిమాండ్..!

ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రంగుమారిన సోయా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులపై లాఠీ ఛార్జి (Baton charge) చేశారు. రైతులను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. మరొకవైపు అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు సోయా పంటకొనుగోలు పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించామని, రైతుల వద్ద ఉన్న సోయా పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ మాజీ మంత్రి అరెస్ట్..

సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ నివాసాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఎంపీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారులపై బారికేడ్లు నిర్మించి ఎక్కడికక్కడే పోలీసులు మోహరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ ఆందోళన దృష్ట్యా పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలో మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *