తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తోన్నారు.
ఈ తెల్లవారు జామున అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ స్వస్థలం వరంగల్ జిల్లా మద్దూర్ మండలం రేబర్తి. అసలు పేరు అందె ఎల్లయ్య. విప్లవాత్మక గేయాలకు పెట్టిందిపేరు.
అందెశ్రీ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకూ చిరపరిచితులు. ఎన్నో విప్లవాత్మక సినిమాలకు పని చేశారు. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. గేయానికి ఊపిరి పోశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్నీ తీర్చిదిద్దారు. ప్రఖ్యాత కాకతీయ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
2006లో గంగ సినిమాకు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. అలాగే- బతుకమ్మ సినిమా కోసం అందెశ్రీ మాటలు కూడా రాసారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను ప్రభుత్వం సన్మానించింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు.