అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్‌కు చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్‌కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తదితర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుక్లా విక్టరీ చిహ్నం చూపుతూ అందరికీ అభివాదం చేశారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆత్రుతతో ఉన్నానని నిన్న ఎక్స్ వేదికగా శుభాంశు శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ సందర్భంగా.. శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకోవడం భారత్‌కు గర్వకారణమైన క్షణంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. “భారతదేశానికి గర్వకారణమైన క్షణం! ఇస్రోకు కీర్తినిచ్చే క్షణం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దీనికి దోహదపడిన వ్యవస్థకు కృతజ్ఞత తెలుపుతూ, దేశ అంతరిక్ష వైభవం భారత గడ్డను తాకింది. భారతమాత దిగ్గజ పుత్రుడు శుభాంశు శుక్లా ఈరోజు తెల్లవారుజామున దిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు” అని తెలిపారు.
యాక్సియం – 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్లా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి. ఇటీవల నిర్వహించిన యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే పలు ప్రయోగాలను నిర్వహించిన శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు ఈ బృందంలో ఉన్నారు.