Srivari's annual Brahmotsavams conclude in Tirumala

నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం ఘ‌నంగా నిర్వ‌హించ‌బ‌డింది. శ్రీదేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్ప‌స్వామి ఉత్స‌వామూర్తుల‌కు చక్రత్తాళ్వార్ స్నానం, చక్రస్నానం ప్రధాన ఘట్టంగా జరిగింది. పంచామృతాలతో అభిషేకాలు, పూజాకార్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం వరకూ భక్తులు పుణ్యస్నానాలు చేయవచ్చు.

ఇక వివ‌రాల్లోకి వెళ్తే..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానాన్ని గురువారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. దీంతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఉత్సవాలకు పరిసమాప్తి పలికినట్లయింది.

శ్రీవారి హుండీ ఆదాయం..

అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం అద్భుతంగా నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఇక‌ ఈ బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని, వారి సంతృప్తే ఈ ఉత్సవాల విజయానికి గీటురాయి అని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా మొత్తం 5.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 25.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

కొండ‌పై గ‌రుడ సేవ‌..

ఇక ఈ సారి.. తిరుమ‌ల కొండ‌పై భక్తుల సేవలోనూ టీటీడీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఉత్సవాల సమయంలో ఏకంగా 26 లక్షల మంది భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించారు. మరోవైపు, 28 లక్షలకు పైగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు. అలాగే, 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఛైర్మన్ వివరించారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శన భాగ్యం కల్పించడం విశేషం. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సాంస్కృతికంగానూ అలరించాయి. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చిన 298 కళాబృందాలకు చెందిన సుమారు 6,976 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తుల భద్రత కోసం 4,000 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు 3,500 మంది టీటీడీ సిబ్బంది నిరంతరం సేవలందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *