గత కొద్ది కాలంగా రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమంత చెక్ పెట్టింది. స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ రెండో వివాహం చేసుకున్నారు. ప్రియుడు రాజ్ నిడిమోరును నేడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లాడింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమంత సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నిన్న రాత్రి నుంచే వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలవగా, ఈ మధ్యాహ్నం సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసి, తాము పెళ్లి చేసుకున్నట్టు పూర్తి స్పష్టతనిచ్చారు.
ఇక వివరాల్లోకి వెళ్తే…
కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ లింగభైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఎరుపురంగు కంచిపట్టుచీర, కొప్పులో మల్లెలతో పెళ్లికూతురుగా ముస్తాబయింది సమంత. పెళ్లికి ముందు ఉంగరాలు మార్చుకున్నారు సమంత-రాజ్ నిడిమోరు. ఆ వెంటనే సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. సమంత-రాజ్ వివాహంపై ఈశా ఫౌండేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లింగ భైరవి సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒక్కటైనట్లు ఈశా ఫౌండేషన్ ప్రకటించింది. ఈ పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సమంత ఎర్రటి చీరలో మెరిసిపోయారు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి..?
భూతశుద్ధి వివాహం అంటే ఏంటనే ఆసక్తి అందరిలోను నెలకుంది. భూతశుద్ధి వివాహం అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయటం అని వివరించారు. ఈషా టీమ్ ఈ వివాహం జరిపించారు. ఈ పద్దతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుందని విశ్వాసం. భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేక పద్ధతి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వజన్మ బంధాలు, లేదా గ్రహదోషాలు వంటి కారణాలను నివారించడానికి చేసే ఒక ఆచారం. శరీరం, మనసు, పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేయడం అనమాట. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్దతిలో వివాహం చేసుకుంటే.. దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్ముతారు.
Content writer : Amulya