Red alert for Himachal Pradesh. Five-storey building collapses due to heavy rains

ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు మూతపడ్డాయి. మండీ (Mandi), సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్‌లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ (Red Alert) నేపథ్యంలో కాంగ్రా, మండీ, సోలన్, సిర్మౌర్‌జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 2023లో వర్షాకాలంలో 550 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక హిమాచల్ ప్రదేశ్‌కు ఆదివారం కుండపోత వానల రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు సిమ్లా వాతావరణ పరిశోధనా కేంద్రం ఆదివారం ప్రకటన వెలువరించింది. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని, పల్లపు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదలు, కొండచరియల పతనం వంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో ఇప్పటికే సిమ్లా కల్కా రైల్వే మార్గంపై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
దీనితో ప్రయాణికులు చిక్కులు ఎదుర్కోవల్సి వచ్చింది. రైలు పట్టాలపై భారీ చెట్లు విరిగిపడటం, కొండరాళ్లు పడటంతో ముందు జాగ్రత్తగా రైళ్లను ఆపివేశారు. సిమ్లా నుంచి దేశంలోని దూర ప్రాంతాలకు దారితీసే సిమ్లా కల్కా జాతీయ రహదారి ఎన్ హెచ్ 5పై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు మూడు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. హిమాచల్‌లోని 10 జిల్లాలకు భారీ వర్షాల రెడ్ అలర్ట్ జారీ అయింది. జాతీయ రహదారి వెంబడి ఉండే కోటి వద్ద భారీ స్థాయిలో వాహనాలు చాలా దూరం వరకూ నిలిచిపోయాయి.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *