సాధారణంగా ఒక శిశువు భూమి మీద పడడానికి 9 నెలలు పడుతుంది. ఇది జగమేరిగిన సత్యం. అయితే అదే 10 నెలల చిన్నారి కడుపులో కవల పిండాలు ఉండటం ఎప్పుడైనా చూశారా..? ఇదే పిచ్చి ప్రశ్న అసలు సృష్టిలో అలా జరుగుతుందా అంటారా..? కానీ జరిగింది. తాజాగా ఓ శిశువు కడుపులో కవల పిండాలు ఉండటం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక విషయంలోకి వెళ్తే..
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఒక ఆడ శిశువు చాలా అరుదైన వ్యాధితో జన్మించింది. మొదట్లో అంతా సాధారణంగానే అనిపించింది. కానీ కొన్ని వారాల తర్వాత ఆ శిశువు కడుపు ఉబ్బరం మొదలైంది. పాలు తాగడం లేదు. తరచుగా చిరాకు పడుతోంది. ఆ శిశువుకు ఒక నెల వయస్సు. దీంతో కుటుంబీకులు గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షలో బాలిక కడుపులో అసాధారణ వాపు తదితర సంకేతాలను వైద్యులు కనుగొన్నారు. ఆ తర్వాత స్కానింగ్ చేయించారు. స్కానింగ్ రిపోర్టును చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. వాస్తవానికి, ఆ నెల వయసున్న బాలిక కడుపులోని పొరలో 2 అసంపూర్ణ పిండాలు ఉన్నాయి. ఇక ఈ పరిస్థితిని ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారు. ఇది 5 లక్షల మంది పిల్లలలో ఒకరిలో మాత్రమే కనిపిస్తుంది. కానీ హర్యానా కేసు చాలా అరుదు. ఎందుకంటే ఆ బాలిక కడుపులో ఒకటి కాదు రెండు అసంపూర్ణ పిండాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సుమారు 200 కేసులు నమోదయ్యాయి.
గతంలో భారత్లోనూ కొన్ని కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులో ఆ శిశువు తల్లి మూడు పిండాలతో గర్భందాల్చింది. అందులో రెండు పిండాలు మూడో పిండం (శిశువు) ఉదరంలో పెరగడం ప్రారంభించాయి. కాగా మొదట శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు.. పోషకాహార లోపం తదితర సమస్యలు ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు. కానీ పరీక్షలో పిండాలు ఉన్నట్లే తేలింది. వైద్యుల వివరణ ప్రకారం.. కడుపులోని పిండాలు శిశువు ప్రేగులు, కడుపుపై ఒత్తిడిని పెంచాయి. దీని కారణంగా శిశువుకు నొప్పి పెరిగింది. ఆకలి సైతం తగ్గింది. మొత్తానికి సర్జరీ చేసి ఈ పిండాలను తొలగించాలని వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. శిశువు శరీరం శస్త్రచికిత్సకు సహకరించేందుకు మొదటగా IV ద్వారా పోషకాహారం, ద్రవాలను అందించారు. అనంతరం జూలై 30న, శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల బృందం బాలిక కడుపు నుంచి అసంపూర్ణ పిండాలు రెండింటినీ తొలగించింది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా మారినప్పటికీ విజయవతంగా ముగించారు.