విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘షో మ్యాన్’ అనే పేరు ఖరారు చేశారు. ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం గమనార్హం. గతంలో రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.
ఇక విషయంలోకి వెళ్తే..
రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన దర్శకుడి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా “శివ” చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. 1990లో విడుదల అయిన ఈ మూవీ తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఆ తర్వాత ‘క్షణక్షణం’, ‘గాయం’, ‘రాత్రి’, ‘అంతం’ వంటి సినిమాలతో ఆడియన్స్ ని టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్కి మకాం మార్చిన ఆర్జీవీ.. 1998లో ‘సత్య’ చిత్రంతో హిందీ ఆడియన్స్ ని పలకరించారు. ఆ మూవీతోనే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అలానే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘కంపెనీ’, ‘రోడ్’, ‘రన్’, ‘సర్కార్’ వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌తో తీసిన ‘సర్కార్’ ఆయన కెరీర్‌లో ఒక హైలైట్‌గా నిలిచింది. కాగా అటు సినిమాల తోనే కాకుండా వివాదాల తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తారు ఆర్జీవీ. సోషల్ మీడియాలోనూ, టీవి ఇంటర్వ్యూల లోనూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, ఓపెన్ గా వ్యక్తపరుస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు.
కొత్త ఏడాది.. కొత్త సినిమా..!
ఇక గత కొంతకాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడు లాగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. అయితే ఎప్పుడూ తెర వెనుకే ఉండే వర్మ.. ప్రభాస్ – నాగ్ అశ్విన్ “కల్కి” సినిమా కోసం మాత్రం అతిథి పాత్రలో తెర మందుకు వచ్చారు. ఉన్నది కొంచెం సేపు అయినా కూడా తన మార్క్ మేనరిజంతో అలరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కంప్లీట్ గా రూట్ మార్చేశారు ఆర్జీవీ. దీంతో ఈ వ్యవహరం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘నూతన్’ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఆర్జీవీతో గతంలో ‘ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2’ వంటి చిత్రాలు నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంగోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభమైంది. రాబోయే సంక్రాంతి పండుగకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా దర్శకుడు నూతన్ అందిస్తున్నారు.