హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది.
ఇక విషయంలోకి వెళ్తే…
ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. అందెశ్రీ హైదరాబాద్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే కొంతసేపటికే అందెశ్రీ మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. అందెశ్రీ మరణంతో సాహితీలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, పలువురు ప్రముఖులు అందెశ్రీ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పాటలు రచించారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతం… తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు పురస్కారం అందించింది.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి…
తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ అని కొనియాడారు. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అని ప్రశంసించారు. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు.
అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం…
అందెశ్రీ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.