Petrol prices : భారత్ లో భగ్గుమంటున్నపెట్రోల్ ధరలు.. లీటర్ పెట్రోల్ భారీగా పెంపు..! .
Petrol Price : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లను వణికిస్తున్న విషక్షయం తెలిసిందేగా. ఇక ఆ పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రీమియం (పవర్) పెట్రోల్ ధరను పెంచాయి. లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెంచాయి. పెంచిన కొత్త ధరలు ఇవాళ్టి నుంచే (మార్చి 20, 2026) అమలులోకి వచ్చాయి.
ఇక విషయంలోకి వెళ్తే…
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతోంది. ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడిన క్రమంలో దేశంలో చమురు కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 115 డాలర్లు దాటిన క్రమంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు వాహనదారులకు బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సాధారణ పెట్రోల్ ధరలను పెంచలేదు. ఇది వాహనదారులకు కాస్త ఉపశమనంగానే చెప్పవచ్చు. అయితే, ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగిన క్రమంలో ఇతర ఇంధన ధరలను సైతం పెంచుతారనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక ఆ యుద్ధం కారణంగా ఇప్పటికే వంట గ్యాస్ ధరలను పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇప్పుడు పెట్రోల్ వంతు వచ్చింది. స్పీడ్, పవర్ వంటి ప్రీమియం పెట్రోల్ ధరలను కంపెనీలు పెంచేశాయి.
లీటర్ పై రూ.2.09 పెంపు..
ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ‘స్పీడ్’, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ‘పవర్’, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ‘XP95’ పెట్రోల్ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ2.35 వరకూ పెరిగాయి. అయితే ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. మెరుగైన ఇంజన్ పనితీరు, మైలేజ్ కోసం వాహనాల్లో ప్రీమియం పెట్రోల్ వాడుతుంటారు. ఇక సవరించిన ధరలను మార్చి 20, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధరలు ఇలా..
ఇక తాజా పెంపుతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో రూ.111.68 స్థాయిలో ఉన్న ప్రీమియం పెట్రోల్ లీటరు ధర రూ.113.77కు చేరినట్లు తెలుస్తోంది. అయితే, డీలర్ కమీషన్ వేరు వేరుగా ఉండడం వల్ల ఇది ప్రాంతాల వారీగా మారుతుంటుంది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగానే ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పవర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్స్ పీ 95 వంటి బ్రాండెడ్ ప్రీమియం పెట్రోల్ ధర పెరిగింది. ఢిల్లీ మార్కెట్ ధరల ప్రకారం స్పీడ్ పెట్రోల్ బీఎస్-6 ధర రూ.2.09 మేర పెరిగి రూ.112.92కు చేరినట్లు తెలుస్తోంది. సాధారణ పెట్రోల్ బీఎస్ 6 ధర రూ.103.81 గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.90.35 వద్ద ఉంది.
ఇండస్ట్రియల్ డీజిల్ ధర 25 శాతం పెంపు..
మరోవైపు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీగా పెంచింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను 25 శాతం పెంచింది. దీంతో లీటర్ ధర రూ.22 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ.87.57 నుంచి రూ.109.59కి ఇది పెరిగింది. ఇండస్ట్రియల్ డీజిల్‌ను విద్యుత్ అంతరాయాల సమయంలో జనరేటర్లపై నడిచే కర్మాగారాలు, ఫాపింగ్ మాల్స్, బుల్డోజర్లు, భారీ యంత్రాల్లో వాడుతుంటారు. వీటి ధరలు పెరగడం వల్ల కంపెనీల ఖర్చు పెరిగి వినియోగదారునిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
సాధారణ, ప్రీమియం మధ్య తేడా ఏంటి?
పెట్రోల్ గ్రేడ్ ను దాని ఆక్టేన్ వాల్యూ ఆధారంగా వర్గీకరిస్తారు. భారత్ లో సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87గా ఉంటుంది. ఇక ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ వాల్యూ 91గా ఉంటుంది. హై ఆక్టేన్ ఉన్న ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేషియోను కలిగి ఉంటుంది. దీంతో వాహనంలోని ఇంజిన్‌ను స్టార్ట్ చేసే టైంలో ఎక్కువ ఇంధనం తీసుకోదు. అంతేకాకుండా కార్బన్ పై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. శక్తిమంతమైన ఇంజిన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, బైకులు, సూపర్ కార్ల వంటి వాటికి ఈ ప్రీమియం పెట్రోల్ ఉత్తమంగా చెబుతారు.