Deputy CM Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. జయసూర్య వ్యవహార శైలి మీద పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భీమవరం డీఎస్పీ జయసూర్య గురించి పవన్ కళ్యాణ్ వద్దకు ఇటీవల తరుచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతని వ్యవహార శైలి మీద ఎస్పీ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, ఆయన నేరుగా సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి పలు ఫిర్యాదులు అందాయి. కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో కూటమి నేతల పేర్లను వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి ఉపముఖ్యమంత్రి సూచించారు. ఇలాంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పవన్ కల్యాణ్ నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లోనే వార్నింగ్ ఇచ్చారు.
ప్రజలందరినీ సమానంగా చూస్తూ శాంతిభద్రతలను కాపాడాలని దిశానిర్దేశం చేశారు. దీంతో డీఎస్పీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు.