హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు, కుంభవృష్టులు అతలాకుతలం చేస్తున్నాయి. డెహ్రాడూన్‌లో కుంభవృష్టి కారణంగా 13 మంది మరణించిన ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవకముందే ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మరో పెను విపత్తు సంభవించింది. నందా నగర్‌లో కురిసిన కుంభవృష్టికి ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టం కాగా, ఐదుగురి ఆచూకీ గల్లంతైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెప్టెంబర్ 20 వరకు డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
చిక్కుల్లో 2,500 మంది పర్యాటకలు..
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి వెళ్లే ప్రధాన రహదారి వరుసగా రెండో రోజూ మూతపడింది. దీంతో సుమారు 2,500 మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు. ఈ విపత్తు వల్ల పదికి పైగా రోడ్లు, వంతెనలు దెబ్బతినగా, వాటిలో ఐదు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్యాటకులు ఎవరూ తమ బస నుంచి బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ‘ముస్సోరీ హోటల్ యజమానుల సంఘం’ మానవతా దృక్పథంతో స్పందించింది. అనుకోకుండా బస చేయాల్సి వచ్చిన పర్యాటకులకు ఒక రాత్రి ఉచితంగా వసతి కల్పిస్తామని ప్రకటించింది.

సహాయక చర్యలు వేగవంతం..
ఈ విపత్తుపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. “దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను మరమ్మతు చేసి, రోడ్డు, విద్యుత్ కనెక్టివిటీని వీలైనంత త్వరగా పునరుద్ధరించడమే మా ప్రయత్నం” అని ఆయన తెలిపారు. ఇప్పటికే 85 శాతం విద్యుత్ లైన్లను పునరుద్ధరించామని, త్వరలోనే మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. సహాయక బృందాలు దాదాపు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని ఆయన వివరించారు. డెహ్రాడూన్-ముస్సోరీ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించేందుకు కొల్హుఖేత్ వద్ద సైన్యం తాత్కాలిక బైలీ వంతెనను నిర్మిస్తోంది.

ప్రకృతి విధ్వంసానికి.. రూ. 4,582 కోట్ల నష్టం
ఇక హిమాచల్ ప్రదేశ్‌లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వారం కురిసిన భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రుతుపవనాల వల్ల హిమాచల్‌లో 1,500 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, రాష్ట్రానికి రూ. 4,582 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. విపత్తులో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద పట్టణాల్లో రూ. 10,000, గ్రామాల్లో రూ. 5,000 అద్దె కింద అందిస్తున్నామని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.