IndiGo : మనలో చాలా మంది విమాన ప్రయాణాలు చేస్తుం ఉంటాం. కొన్ని సందర్భాల్లో.. విమానంలో చోటు చేసుకున్న ఘటనలు వార్తల్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అంటే.. కొందరు తప్పతాగి విమానంలో ప్రయాణించడం, వికృతచేష్టలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం, లేదంటే కొందరు ఆకతాయిలు పక్క ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించడం తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.
ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ వ్యక్తి ఇండిగో (IndiGo) విమానంలో హల్‌చల్ చేశాడు. తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ముంబై నుంచి కోల్‌కతా (Mumbai to Kolkata) వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఎందుకు కొట్టావని అడగ్గా.. అతని వల్ల తనకు సమస్య ఎదురైందని చెప్పాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. అతడి ప్రవర్తనకు విమానంలోని వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విమాన సిబ్బంది ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక ఈ ఘటనను ఇండిగో (IndiGo) సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వికృత ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, గౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యనైనా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్ పోస్టులో వెల్లడించింది.