అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు.
సూడాన్ : ప్రపంచ దేశాలను ప్రకృతి విప్తత్తులు వదలడం లేదు. రెండు రోజుల క్రితమే భూకంప తాకిడికి అఫ్గానిస్థాన్ కకావికలం అయ్యింది. భూకంపం నేపథ్యంలో సుమారు 800 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. వేల మంది గాయపడ్డారు. వందలాది భవనాలు నెలమట్టం అయ్యాయి. గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా అఫ్గాన్ దీన్ని వర్ణించింది. ఇదిలా ఉండగానే.. మరో చోట ప్రకృతి కన్నెర్ర చేసింది. సూడాన్‌లో కొండచరియలు విరిగి పడటంతో సుమారు 1000 మందికిపైగా మరణించారని తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వానలతో ఆగస్టు 31న కొండ చరియలు విరిగిపడ్డాయని సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ (SLM/A) వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఓ గ్రామం పూర్తిగా నేలమట్టమైందని, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది.
పశ్చిమ డార్ఫర్‌లోని ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని, మృతుల్లో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని అబ్దెల్వాహిద్ మహ్మద్ నూర్ బృందం పేర్కొంది. కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఉత్తర డార్ఫర్‌లో సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)కు మధ్య భీకర అంతర్యుద్ధం జరిగింతున్నది. దీంతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వచ్చారు. ప్రకృతి విపత్తులో వారు మరణించడం గమనార్హం.