Manjeera Dam in danger.. Flooding over the gates

తెలంగాణలో గత కొంత కాలంగా.. ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు ప్రమాదపు జాబితాలో చేరింది. అదేదో కాదు.. మంజీరా ప్రాజెక్టు. అవును ప్రస్తుతం మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపోయింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీర బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్దమొత్తంలో ఉండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుక యత్నించగా బ్యారేజీ గేట్లు తెరుచుకోవడం లేదు. నీటి ప్రవాహం ఎక్కవగా రావడంతో గేట్లు తెరుచుకోకపోవడంతో నీరు గేట్లు పై నుంచి కిందకు దుంకుతున్నాయి. బ్యారేజీ సిబ్బంది గేట్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించి ఓపెన్ కాకపోవడంతో హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ ఇంజనీర్లకు సమాచారం అందించారు. దీంతో మంజీరా బ్యారేజీకి చేరుకున్న ఇంజనీర్లు గేట్లను పరిశీలించారు.

దీంతో మంజీరా డ్యామ్ కు ప్రమాదం పొంచి ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ప్రకటించింది. బ్యారేజ్ లో నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని బృందం చెప్పింది. ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఆప్రాన్ కొట్టుకుపోవడం వల్ల డ్యామ్ కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా ప్రాజెక్టుకు ఈ వర్షా కాలంలో వరద ప్రవాహం పెరిగితే మరింత ప్రమాదం పొంచి ఉంటుంది అని గతంలోనే ఓ నివేధిక ఇచ్చింది.. వాళ్లు అన్నట్లుగానే ప్రస్తుతం డ్యాం ప్రమాదానికి గురైంది.

ఇక ఇదేకాకుండా.. 2025 మార్చి నెల 22వ తేదీన మంజీర బ్యారేజీని జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం ఏర్పాటైన ఎస్టీఎస్ఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం పిల్లర్లలో పగుళ్లు, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు తుమ్మచెట్లు భారీగా పెరిగిపోవడంతో మరింత పరిశీలించడానికి తమకు అవకాశం లేకుండా పోయిందని డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. వరద ఉధృతికి కోతకు గురైన చోట ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలి. కానీ, అలా జరగలేదు. వెంటనే రిపేర్లు చేయాలని నివేదికలో చెప్పారు. ఉక్కు, కాంక్రీట్ తో కట్టి ఉంటే అంత ప్రమాదం ఉండేది కాదని.. అయితే, ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు.

ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకే కాకుండా ఆ చుట్టు పక్కల ప్రాంతంలో కొన్ని లక్షల మందికి నీటిని సరఫరా చేసే మంజీరా డ్యామ్ పూర్తి స్థాయిలో డేంజర్ జోన్ లో ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక సమర్పించింది. మేడిగడ్డ తరహాలో ఈ బ్యారేజీకి కూడా దిగువ భాగంలో కొట్టుకుపోయిన ఆఫ్రాన్ వల్ల ప్రమాదం ఉందంది. అదే విధంగా ఎక్కడికక్కడ పిల్లర్లలో పగుళ్లు వచ్చాయని సంస్థ తెలిపింది. కానీ, ఇప్పటివరకు మంజీరా డ్యామ్ నిర్వాహాకులు దీన్ని పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇక మంజీర బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం జరుగకముందే అధికారులు తేరుకుని బ్యారేజీకి రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *