నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో రోప్ వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు విరిగిపడడం వారంలో రెండవ సారి.

ఇక విషయంలోకి వెళ్తే…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కుంభవృష్టిని కురుపించాయి. భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీశైలం రాకపోకలు సాగించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడటంతో.. శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి శ్రీశైలం హైదరాబాద్ ఘాట్రోడ్డులోని డ్డయమ్, స్విచ్ యార్డ్ సమీపంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద కొండ చరియలు, బండరాళ్లు, చెట్లు విరిగి రోడ్డుపై అడ్డుగా పడిపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, కొండచరియలు, బండరాళ్లు, చెట్లు విరిగినపడిన ప్రాంతంలో.. ఆ సమయంలో వాహనాలు ఏమి లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కొండచరియలు విరిగినపడిన సమయంలో.. ఆ ప్రాంతంలో కారు, బస్సు, లారీలు ఏదైనా ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని.. ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని.. ఆ సమయంలో అక్కడ ఏ వాహనం, భక్తులు ఎవరూ లేకపోడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కురిసే సమయంలో ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ని మొంథా తుఫాన్ ఎంత ప్రభావితం చేసిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మొంథా ప్రభావంతో అక్టోబర్ 29న శ్రీశైలం రోప్ వే దగ్గరలోని పాతాళగంగ మెట్ల మార్గం దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో షాపులు ధ్వంసం అయ్యాయి. రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడటంతో భక్తులు లేనందున ప్రమాదం తప్పింది. తరచూ కొండ చరియలు విరిగిపడటంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే.. భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.