వినాయక చవితి… భారత దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతటి వైభవంగా జరిపే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధం అవుతున్నారు. చెందాలు వేసుకుంటు, గణేష్ మండపాలు కట్టేందుకు సిద్ధం అవుతారు. నగరాలు, పల్లెల్లు అని తేడా లేకుండా.. చవితి ఉత్సవాలు జరుపుతారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా ఒక్కో రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసే గణేశుడ్ని మనసారా కొలిచేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు. అంతటి మహిమాన్వితమైన గణేష్ గా ఎన్నో ఏళ్ల నుంచి ఖ్యాతి పొందింది ఖైరతాబాద్ గణేష్. మరి ఖైరతాబాద్ గణేష్ చరిత్రను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మరి ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ప్రపంచ రికార్డు..
శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఏ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. 70 అడుగుల ఎత్తుతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. మరి ఈ గణపయ్య ప్రయాణం ఖైరతాబాద్‌లో ఎలా ప్రారంభమైంతో తెలుసా? స్వాతంత్య్ర ఉద్యమకారుడు తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం కొనసాగుతోంది.
1954 నుంచే నవరాత్రి ఉత్సవాలు..

గణపతి బప్పా మోరియా అంటూ ప్రతి ఏడాది పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతాయి. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కి బారులు తీరుతారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఖైరతాబాద్ గణనాథుడికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఒక్క అడుగుతో 1954వ సంవత్సరం నుంచి ఖైరతాబాద్‌లో గణేశ్ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో హైదరాబాద్‌కి చెందిన సింగరి శంకరయ్య, 1954లో మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అలా ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి ప్రయాణం, నాటి నుంచి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చాడు. ఇక ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్ కోసం భారీ లడ్డూను చేయిస్తారు. 2021 వరకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి లడ్డూను తీసుకొచ్చేవాళ్లు. ఖైరతాబాద్ గణేష్ లడ్డూ అనేక సార్లు గిన్నిస్ బుక్ లోనూ చోటు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత నుంచి స్థానికంగానే లడ్డూ తయారు చేస్తున్నారు.
ఖైరతాబాద్ ఎత్తు ప్రముఖ్యత..

ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ అత్యంత ప్రత్యేకమైనదే. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ, భక్తులను ఆకట్టుకుంటున్నాడు. 2014వ సంవత్సరం నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని, ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకూ ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకొచ్చారు. అయితే భక్తుల కోరిక తిరిగి 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2020లో కొవిడ్ నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా, గత ఏడాది 63 అడుగుల ఎత్తులో భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశాడు.
71వ సంవత్సరంలో.. 69 అడుగుల ఎత్తు..

ఇక ఈ ఏడాది అంటే 2025 లో 71వ సంవత్సరం 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతిగా వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. స్వామి వారికి ఇరువైపులా కుడి పక్కన శ్రీజగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు.. ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గణేష్ విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. తలపై పడగవిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఉంటుంది. ఇప్పటికే ఖైరతాబాద్ విగ్రహం ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను దర్శనమించి యావత్ దేశం చూపును తన వైపుకు తిప్పుకుంది.