కేరళలోని (Kerala) శబరిమలలో (Sabarimala) ఉన్న అయ్యప్ప స్వామిని (Ayyappa Swami) దర్శించుకునేందుకు, ఇరుముడులు సమర్పించుకునేందుకు ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశ వ్యాప్తగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు, అయ్యప్ప స్వాములు వస్తుంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య కూడా వేల సంఖ్యలో ఉంటుంది. కేరళలో మరో కొత్తగా అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (Amebic meningoencephalitis) అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ (Kerala Health Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
ఇక విషయంలోకి వెళ్తే..
ఇక ప్రస్తుతం కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరు విలక్కు పూజల సీజన్ ప్రారంభం అయ్యింది. రెండు నెలల పాటు జరిగే ఈ సీజన్‌లో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం వస్తారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం (Kerala Govt) యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేసింది. అలాగే, అయ్యప్ప స్వాములకు కీలక సూచనలు చేసింది. కేరళలో బ్రెయిన్ ఫీవర్ (Brain fever) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నదీ స్నానాలకు వెళ్లేటప్పుడు జాగ్రతగా ఉండాలని సూచించింది.
మెదడును తినే అమీబా..
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వ్యాధి కేసు వెలుగులోకి వచ్చి దాదాపు 19 మందికి పైగా మరణించారు. కన్నూరులోని తాలిపరానికి చెందిన మూడున్నరేళ్ల బాలుడికి అమీబిక్ మెదడువాపు వ్యాధి సోకినట్లు తొలి మరణ కేసు నమోదు చేసుకుంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకింది. దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయ్యప్ప స్వాములకు ఆరోగ్య శాఖ కీలక ఆదేశం..
శబరిమలకు వస్తున్న అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ ఇవాళ పలు కీలక సూచనలు చేస్తూ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ (అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ ) కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరింది. దీంతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 04735203232ను సంప్రదించాలని సూచిస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు ‘బ్రెయిన్ ఫీవర్’ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. కేరళలో తాజాగా ప్రమాదకరమైన ఈ మెదడు వాపు అమీబా కారణంగా వ్యాధి ప్రబలుతోందని హెచ్చరించింది. దీనిని ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ ఫీవర్ అని అంటారని తెలిపింది. దీని బారిన పడకుండా ఉండాలంటే నీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు శబరిమల సన్నిదానంలోని నదులు, చెరువులు, కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది. సాధారణంగా ఇక్కడ నీటిలో నెగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ అమీబా నీటిలో వీరు మునిగినప్పుడు ముక్కు ద్వారా మెదడుకు చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతోంది. కాబట్టి అయ్యప్ప భక్తులు నీటిలో దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.