Kedarnath temple in Uttarakhand closed

Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరాఖండ్‌లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి శాస్త్రోత్తంగా ప్రధాన ద్వారాలను మూసివేశారు. అనంతరం బాబా కేదారేశ్వరుడి పంచముఖి డోలియాత్ర ఉఖీమఠ్‌కు వెళ్లింది. ఈ ఆరు నెలలు కేదారేశ్వరుడు ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజలు అందుకోనున్నాడు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సైతం ఆలయానికి చేరుకుని ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నారు. కేదార్‌నాథ్ చలి, మంచు కారణంగా 6 నెలలు ఈ ఆలయాన్ని మూసి వేస్తారు. మళ్లీ ఎప్రిల్, మే లో తెరుస్తారు.

ఈ సీజన్‌లో 17.39 లక్షల మంది దర్శనం..

ఇప్పటికే కేదార్‌నాథ్ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. బుధవారం మధ్యాహ్నమే ఆ ప్రాంతంలో మంచు కురవడం మొదలైంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం, మంచు మూసుకుపోవడం వంటి కారణాల వల్లనే ఆలయ ద్వారాలను సాంప్రదాయబద్ధంగా మూసివేశారు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కేదార్‌నాథ్ ఆలయం తిరిగి వచ్చే వేసవి కాలంలో అంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో ఈ ఆలయ తలుపులు తెరిచే అవకాశం ఉంది. ఇక ఈ కేధార్ ఆలయ ద్వారాలు మూసివేసే సమయంలో స్వామివారిని డోలీ యాత్రగా తరలించడం ఒక ప్రత్యేక ఉత్సవం. ఈ డోలీ యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తమ ఆరాధ్య దైవాన్ని వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్ర అంచనాలకు మించి విజయవంతం అయింది. ఈ సీజన్ మొత్తంలో 17 లక్షల 39 వేల మంది భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిరంతరాయంగా తరలి వచ్చారు. ద్వారాలు మూసే రోజు బుధవారం సాయంత్రం కూడా దాదాపు ఐదువేల మంది భక్తులు చివరి సారిగా దర్శనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *