Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు. ప్రెస్ మీటు పెట్టిమరీ సొంత కుటుంబసభ్యులే కాదు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ లైన్ ను ఆమె పూర్తిగా దాటినట్లు అదినేత కేసీఆర్ భావించినట్లున్నారు… అందుకే సొంత కూతురని కూడా చూడకుండా చర్యలు తీసుకున్నారు. ఆమెను బిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు.
ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది. “పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది.
భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారికంగా కవిత సస్పెన్షన్ గురించి ప్రకటించింది. ఇటీవలకాలంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని… దీనివల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉండటంతో అదిష్టానం తీవ్రంగా పరిగణించిందని బిఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకే కవితను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇలా బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి. రవిందర్ రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ పేరిట అధికారిక ప్రకటన వెలువడింది.