ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
అగరం’ ఫౌండేషన్ లో హాట్ కామెంట్స్..
ఇక వివరాల్లోకి వెళ్తే యూనివర్సల్ స్టార్ ‘కమల్ హాసన్’ (Kamal Haasan) ఇటీవల ప్రముఖ హీరో ‘సూర్య'(Suriya) స్థాపించిన ‘అగరం’ ఫౌండేషన్ (Agaram Foundation) లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు ‘నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. ఈ యుద్ధంలో గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుందని మాట్లాడటం జరిగింది. కమల్ మాట్లాడిన ఈ మాటలపై రీసెంట్ గా ప్రముఖ తమిళ టివి నటుడు ‘రవిచంద్రన్’ (Ravi Chandran) మాట్లాడుతు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన కమల్ హాసన్ ని చంపేస్తానని, తల నరికేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.
రవిచంద్రన్ వార్నింగ్..
ఇప్పుడు ఈ మాటలు తమిళనాట సంచలనంగా మారాయి. ఇక కమల్ అభిమానులతో పాటు, మక్కల్ నీది మయ్యం’ పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ లలో రవిచంద్రన్ పై ఫిర్యాదు చేసారు. రవిచంద్రన్ పై చర్యలు తీసుకొని ఇక ముందు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యకుండా చూడాలని కోరుతున్నారు. రవిచంద్రన్ సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల సీరియల్స్ లో చేస్తు మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా’ పాండియన్ స్టోర్స్’ (Pandian Stores) సీరియల్ రవిచంద్రన్ కి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది. సెంథిల్ అనే క్యారక్టర్ ద్వారా ప్రతి ఇంటికి ఎంతగానో చేరువయ్యాడు. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడి హోదాలో కమల్ హాసన్ ఇటీవల అధికార డిఎంకె పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. ఆ హోదాలోనే అగరం ఫౌండేషన్ కి హాజరై, సనాతన దర్శంపై కీలక వ్యాఖ్యలు చేసాడు.
అప్పుడు ఉదయ్ నిధి స్టాలిన్.. ఇప్పుడు కమల్ హాసన్..
గతంలో కూడా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటి వైరస్ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఉదయ నిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తమిళనాడు లో ఇలా సనాతన ధర్మంపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
సినిమాలతో బిజీ బిజీగా కమల్..
ఇటీవల కమల్ హాసన్ డీఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే, ‘భారతీయుడు 2’ , ‘థగ్ లైఫ్’ వంటి సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. తాజాగా, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా రెండో భాగంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో కమల్ హాసన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వివాదం రాజకీయ మరియు సినీ రంగాలలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ప్రస్తుతం కమలహాసన్ ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరో వైపు సినిమాల్లో బిజీగా ఉన్నారు. తాజా వ్యాఖ్యలు తమిళనాట పలు చర్చలకు దారి తీస్తున్నాయి.