Japanese technology in Hyderabad..! Footpaths made of plastic waste...

కొత్త టెక్నాలజీ..!

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 65-70 శాతం వరకు పాత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే..

హైదరాబాద్ రోడ్లపై కొత్త లుక్ రాబోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన అందమైన ఫుట్‌పాత్‌లు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో దర్శనమివ్వబోతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్‌పాత్‌లపై ప్లాస్టిక్ టైల్స్ వినియోగించాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రతి రోజు పోగయ్యే సుమారు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్తలోని ప్లాస్టిక్ ను వేరు చేసి, దాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆవరణలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ లో రీ సైక్లింగ్ చేసి, ఫుట్ పాత్ లకు వినియోగించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్ ను సెలెక్ట్ చేశారు. ప్లాస్టిక్ ను రీ సైక్లింగ్ చేసి దాంతో పలు నమునాలతో ప్లాస్టిక్ టైల్స్ తయారు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ప్లాస్టిక్ కూడా పేరుకుపోకుండా ఉంటుందని భావిస్తున్నారు. రాజ్ భవన్ రోడ్డులో కిలోమీటర్ మేర ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ టైల్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ వేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

1.68 కోట్లతో ప్రాజెక్టు…

GHMC – గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 1.68 కోట్లతో ఒక వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రామానాయుడు స్టూడియో నుంచి రోడ్ నంబర్ 79/82 జంక్షన్ మీదుగా భారతీయ విద్యా భవన్ వరకు 1.5 కిలోమీటర్ల మేర ఈ మోడల్ ఫుట్‌పాత్ ను నిర్మిస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో వాడే పేవర్ బ్లాక్స్ 65-70 శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వేస్ట్‌తో తయారైనవే. పర్యావరణానికి మేలు చేసే ఈ “ఎకో ఫ్రెండ్లీ” ప్రాజెక్ట్‌ను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సోలార్ గ్రిడ్‌లతో కూడిన షెల్టర్లు, పచ్చని చెట్లతో ఈ ఫుట్‌పాత్ ఒక పార్కులా కనిపించబోతోంది. ప్లాస్టిక్ భూతంలా మారుతున్న ఈ రోజుల్లో, దాన్ని ఇలా రోడ్లుగా మార్చడం నిజంగా మంచి ఆలోచనే. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. “ఎప్పుడూ హైటెక్ సిటీ, ఫిల్మ్‌నగర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తారు? మిగతా ఏరియాల్లో ఉన్నవాళ్లు మనుషులు కాదా?” అని ఓ నెటిజన్ గట్టిగానే ప్రశ్నించారు. మిగతా చోట్ల కనీస రోడ్లు, డ్రైనేజీ లేక జనం ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ కోట్లు కుమ్మరించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ ఈ ప్రాజెక్ట్‌ను స్వాగతిస్తూనే ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు.

బస్తీలకే మొదటి ప్రాధాన్యత…

“ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ బ్లాక్స్‌ను మన తెలంగాణ స్టార్టప్‌ల నుంచే కొనుగోలు చేయండి. మన దగ్గర చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు సర్క్యులర్ ఎకానమీలో అద్భుతాలు చేస్తున్నారు” అని సూచించారు. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి GHMC ప్లాన్ సూపర్, కానీ అది అమలు చేసే ఏరియా మీదే జనాలకు అభ్యంతరాలు ఉన్నాయి. అభివృద్ధి అనేది కేవలం కొన్ని హై ఫై ఏరియాలకే పరిమితం కాకుండా, సామాన్యుడు నివసించే బస్తీలకు కూడా విస్తరిస్తేనే ఇలాంటి ప్రాజెక్టులకు అసలైన సార్థకత ఉంటుంది. ఏదేమైనా, ప్లాస్టిక్‌ను రోడ్డుగా మార్చే ఈ టెక్నాలజీ హైదరాబాద్‌కు కొత్త అందాన్ని తేవడం ఖాయం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *