Huge explosion in Delhi.. 8 killed, dozens injured in Red Fort blast.. High alert

ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు.

ఇకర విషయంలోకి వెళ్తే…

దేశంలో ఉగ్రవాదుల కుట్రలు భగ్నం అవుతున్న వేళ.. రాజధాని ఢిల్లీలో పేలుడు జరగడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడం, వారి ప్రయత్నాలను ఫెయిల్ చేయగా.. హర్యానాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హర్యానాలో భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ పట్టుబడటం దేశం మొత్తాన్ని వణికించింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దేశ రాజధానిలో భారీ పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు వెల్లడించారు.

సాయంత్రం 6.45 గంటలకు పేలుడు..

ఎర్రకోట గేట్ నంబర్ 1 వద్ద ఆపి ఉంచిన కారులో ఈ భారీ పేలుడు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలిపాయి. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న 8 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడుతో సమీపంలో ఉన్న షాపులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మృతదేహం ఛిద్రమైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పేలుడులో అక్కడే ఉన్న కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గర్లో ఉన్న ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది.. హుటాహుటిన అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మరోవైపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ బృందాలు కూడా రంగంలోకి దిగి.. దర్యాప్తు చేపట్టనున్నాయి. 7 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపి.. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారు అనేది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. మరోవైపు.. పేలుడు సమాచారం తెలుసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

హర్యానాలో ఉగ్ర దాడి భగ్నం..

హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న రోజే ఢిల్లీలో ఈ భారీ పేలుడు సంభవించడం గమనార్హం. దీంతో ఈ రెండు సంఘటనలకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఆర్డీఎక్స్ దాడులు..

దేశంలో RDX కు చాలా భయంకరమైన చరిత్ర ఉంది.1993 ముంబై పేలుళ్లు: 257 మంది చనిపోయిన ఆ దాడుల్లో RDX నే వాడారు. 2019 పుల్వామా దాడిలో 40 మంది CRPF జవాన్లు చనిపోయిన కారు బాంబు దాడిలో కూడా ఇదే RDX ను ఉపయోగించారు. గతంలో జరిగిన దాడుల్లో వాడిన RDX కూడా సరిహద్దుల అవతల నుంచే వచ్చింది. ఇప్పుడు దొరికిన 300 కిలోల RDX కూడా అక్కడి నుంచే వచ్చిందని భద్రతా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కాశ్మీర్ నుంచి హర్యానాకు ఎలా వచ్చింది..? అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *