తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177 కోట్ల ధర పలికింది.
ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధర కావడం గమనార్హం. వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ 7.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు గాను మొత్తం రూ.1,357.57 కోట్లు చెల్లించింది. గతంలో కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఇక గచ్చిబౌలికి అత్యంత సమీపంలో ఐటీ, పారిశ్రామికీకరణకు గుండెకాయలాంటి రాయదుర్గం ప్రాంతంలో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమి వేలానికి టీజీఐఐసీ ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా TGIIC ఎండీ శశాంక మాట్లాడుతూ.. తాజా ధర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మునుపటి రికార్డులను బద్దలు కొట్టిందని తెలిపారు. 2022లో కోకాపేట నియోపోలీస్‌లో జరిగిన వేలంలో ఎకరాకు రూ.100.75 కోట్లు గరిష్ఠ ధర పలికిన రికార్డును.. ఈ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వేలం అధిగమించింది. కొత్త రికార్డు ధర రూ.177 కోట్లు కావడంతో.. ఇది గత కోకాపేట ధర కంటే దాదాపు 75% అధిక వృద్ధిని సాధించినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పారదర్శక, వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తోందని.. పెట్టుబడిదారులు హైదరాబాద్ భవిష్యత్తుపై ఉంచిన నమ్మకానికి ఈ వేలం నిదర్శనమని శశాంక పేర్కొన్నారు. ఈ వేలాన్ని జేఎల్ఎల్ ఇండియా, ఎంఎస్టీసీ సంస్థల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.